రఘునాథపాలెం, ఆగస్టు 18: ఖమ్మం నగరంలో కాంగ్రెస్ నేతలు భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం నగరం 4వ డివిజన్ పరిధి పాండురంగాపురంలో ఓ వ్యక్తి భూమి ఆక్రమణకు పాల్పడగా.. కాంగ్రెస్ యువనేత ఒకరు అండగా నిలిచారు. ఆక్రమణ స్థలం బల్లేపల్లి రెవెన్యూకి సంబంధించినది ఐనప్పటికీ తప్పుడు పత్రాలు కలిగిన భూకబ్జాదారుడికే వత్తాసు పలుకుతున్నాడు. మల్లెమడుగు రెవెన్యూ పరిధిలోని ప్రైవేటు సర్వే నెంబర్‌కు చెందిన ప్లాటు పత్రాలను చూపిస్తూ బల్లేపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఇది ప్రభుత్వ స్థలానికి చెందిన భూమి అని స్థానికులు వారిస్తున్నా.. ఏమాత్రం వినకుండా మా వద్ద ఉన్న పత్రాలు ఈ స్థలానికి చెందినవే అంటూ బలవంతంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంతేకాదు స్థలానికి రెండువైపులా ఉన్న రోడ్లను సైతం ఆక్రమించేందుకు కబ్జాదారు చేస్తున్న ప్రయత్నానికి అధికార పార్టీ యువనేత అనుచరులు చేస్తున్న హడావుడిని చూసి స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్లాటుకు ఇరువైపులా రోడ్డు పక్కాగా కనిపిస్తున్నా.. కానేకాదంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ విషయం పోలీస్‌స్టేషన్‌కు చేరగా పోలీసులు సైతం యువనేత చెప్పాడని కబ్జాదారుకే రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారుల వద్ద ఉన్న పత్రాలు ప్రైవేటు సర్వే నెంబర్‌కి చెందినవి అని వివరించే ప్రయత్నం చేసినా పోలీసులు పెడచెవిన పెడుతున్నారని వాపోతున్నారు. పైగా ఆక్రమణదారుల వద్ద ఉన్న పత్రాలే సరైనవి అంటూ వారికే సపోర్ట్ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
రోడ్డును సైతం కబ్జా చేస్తున్నారు..
కాలనీ ఏర్పాటైన సమయంలో వెంచర్ చివరి ప్లాటుకు ఆనుకొని ప్రభుత్వ మిగులు భూమిని అధికార పార్టీకి చెందిన నాయకుడి సహాయంతో కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సదరు ప్రభుత్వ భూమికి రెండువైపులా ఉన్న రోడ్లను సైతం లేకుండా చేసేందుకు పూనుకున్నారు. ఎన్నో ఏండ్లుగా కాలనీవాసులు నడిచే రోడ్డును సైతం కబ్జా చేయడం సరికాదు.
-చల్లా శ్రీను, స్థానికుడు, పాండురంగాపురం
తప్పుడు పత్రాలతో ఆక్రమిస్తున్నారు..
బల్లేపల్లి రెవెన్యూకి చెందిన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సర్వేనెంబర్ పత్రాలను తీసుకొచ్చి కబ్జా చేసేందుకు పాల్పడుతున్నారు. పోలీసులు సైతం వారికే సపోర్ట్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు విచారణ చేసి భూకబ్జాను నిలువరించాలి.
-మిరియాల రమేశ్, స్థానికుడు, 4వ డివిజన్
సర్వే చేసి చర్యలు తీసుకుంటాం..
ఫిర్యాదు మేరకు స్థలాన్ని పరిశీలించాం. అది బల్లేపల్లి రెవెన్యూకి చెందిన ప్రభుత్వ భూమి. ఆక్రమించే వ్యక్తి వద్ద మల్లెమడుగు రెవెన్యూకి చెందిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. దీనిపై మరోమారు సర్వే చేసి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఇరువైపులా ఉన్న రోడ్ల ఆక్రమణపై హెచ్చరించాం. ప్రభుత్వ భూమి పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతాం.
-జయచందర్, తహసీల్దార్, ఖమ్మం అర్బన్