ఆదిలాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకంపై హైకోర్టు స్టే విధించిందని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మహిళలతో కలిసి యుద్ధభేరి మోగించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఇచ్చోడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు డప్పు చప్పుళ్లు, జెండాలు, ప్లకార్డులు ప్రదర్శించి నిరసన ర్యాలీ చేపట్టారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో బీఆర్ఎస్ నాయకులు వేలాది మందితో జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. బేలలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రావుత్ మనోహర్ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ కార్యాలయం నుంచి మహిళలు, బీఆర్ఎస్ నాయకులు భారీగా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అకడ కొద్దిసేపు బైఠాయించి తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
జైనథ్ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట మాజీ ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యురాలు పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రద్దు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ మూడేళ్లు పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వం, బీఆర్ఎస్ పథకాలను రద్దు చేస్తూ పేదల జీవితాలతో ఆడుకుంటున్నదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక ఉన్న పథకాలు ఊడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఎప్పుడు ఏ పథకం రద్దవుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు.
ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం విషయంలో కోర్టులో కౌంటర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. పేదల పథకాలు రద్దవుతుంటే స్థానిక బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ఎందుకు స్పందించడం లేదన్నారు. పేద కుటుంబాలకు ఆత్మగౌరవంగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగించేంత వరకు బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వస్తే ప్రజలు తరిమికొట్టాలని సూచించారు. భూ కబ్జాలపై కోర్టుల్లో కౌంటర్లు వేస్తున్న ప్రభుత్వం ప్రజల పథకాలను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కోర్టుల పేరిట పథకాలను పక్కన పెట్టే కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు. పథకాలకు సంబంధించిన అంశాలను సమర్థవంతంగా కోర్టుకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 15 లక్షల కుటుంబాలను కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక సాయం అందించడం జరిగిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా ఉన్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇచ్చోడలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 14 లక్షల మంది ఆడబిడ్డలకో కేసీఆర్ కిట్ ద్వారా ప్రయోజనం చేకూరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేసిన పథకాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు పథకంలో భాగంగా కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకాన్ని నిలిపివేయడానికి కుట్రలు చేస్తుందన్నారు. హైకోర్టులో గడువు లభించినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ప్రైవేటు కేసుల్లో న్యాయవాదుల సేవలు తీసుకుంటారు. ప్రభుత్వం పేద ఆడబిడ్డల హక్కుల సంబంధించిన పథకంలో ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని జాప్యం చేసి పథకాన్ని నిలిపివేసే ప్రయత్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని, పథకాన్ని కొనసాగించడంతోపాటు ఎన్నికల సమయం లో హామీ ఇచ్చిన విధంగా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని, రైతుబీమా పథకాన్ని రద్దు చేసి వారి కుటుంబాలకు అన్యాయం చేస్తుందన్నారు. పేదల పథకాలన రద్దు కొసాగించేంత వరకు ఆందోళనలు చేస్తామన్నారు.