హైదరాబాద్, అక్టోబర్29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ చేసిన కృష్ణాజలాల కేటాయింపులను ముట్టుకోవద్దని, వాటిని యథాతధంగా కొనసాగించాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఏపీ నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీ కోసం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో బుధవారం ప్రారంభమైంది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట ఏపీ సర్కారు తన వాదనలను ప్రారంభించింది.
1970లో బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించిందని, వాటిని యథాతధంగా అలాగే ఉంచాలని ఏపీ తెలిపింది. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయాలని ఉన్నదని, సెక్షన్ 3 కింద నీటి కేటాయింపులు చేసే అధికారం లేదని వెల్లడించింది. సెక్షన్ 46 కింద ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీని ప్రకటించారని, అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు నీటి కేటాయింపులను ఇవ్వాలని ట్రిబ్యునల్‌ను ఏపీ డిమాండ్ చేసింది. అనంతరం ట్రిబ్యునల్ తదుపరి విచారణ నవంబర్ 25, 26, 27వ తేదీలకు వాయిదా పడింది.