కొత్తపల్లి, అక్టోబర్ 7 : ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, న్యాయమైన సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే దసరా తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హెచ్చరించారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలను దసరాలోపు ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వేతనాలు, ఇతర బిల్లుల చెల్లింపులను ఈ-కుభేర్తో కాకుండా జిల్లా ట్రెజరీల ద్వారా అందేలా చూడాలని, ఎంప్లాయీస్ హెల్త్ సీమ్‌ను వెంటనే ప్రకటించాలని కోరారు. లీవ్ సాలరీ, జీపీఎఫ్ లోన్లు, మెడికల్ బిల్లులు, లీవ్ ఇన్ క్యాష్ అసెస్మెంట్, బిల్డింగ్ లోన్లను వెంటనే చెల్లించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, నాయకులు ముప్పిడి కిరణ్‌కుమార్, నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్‌రెడ్డి, ఒంటెల రవీందర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, గంగారపు రమేశ్, సర్దార్ హర్మీందర్‌సింగ్, రాజేశ్ భరద్వాజ్, సబిత, విజయలక్ష్మి, రాజేశ్వర్‌రావు, రామస్వామి, వివిధ డిపార్ట్మెంట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.