హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ): కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగంలోనే పూర్తిస్థాయిలో దానిని నిర్వహించాలని, ఫ్యాక్టరీలో 90 శాతం మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానికులకే కేటాయించాలని కోరారు. తెలంగాణ హకులు, న్యాయమైన డిమాండ్ల సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం శాంతియుత ధర్నా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ ఆందోళనలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, రైల్వే డివిజన్ సాధన తదితర కీలక డిమాండ్లు నెరవేర్చాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నార్లగిరి రమేశ్, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, సంకు నర్సింగరావు మాట్లాడారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాసర్ సూచనల మేరకు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టామని చెప్పారు.
గత 12 ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపుతున్నదని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడంలో రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కలిసి తెలంగాణ డిమాండ్లను వివరించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొంగు అశోక్‌యాదవ్, పులి రజినీకాంత్ ముదిరాజ్, పోలపెల్లి రామ్మూర్తి, అఫ్జల్, గబ్బేట శీను, నరసింహారావు, దువ్వ కనకరాజు, కొండ రాజు, పులి విక్రమ్, బరిగెల వినయ్, పున్నం చందర్, తండమళ్ల వేణు, చుంచు అశోక్, నరేశ్, సాధినేని సుధాకర్, దశరథం, రాబర్ట్, వంశీ, గణేశ్, చందు, హుస్సేన్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.