అలంపూర్ చౌరస్తా, నవంబర్ 23 : భూ తల్లిని నమ్ముకుని జీవిస్తున్న రైతులతో రాజకీయాలు చేయొద్దని అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని చోట్లా పీఏసీసీఎస్ ద్వారా కొనుగోలు చేస్తుండగా ఇక్కడ మాత్రం ఏఎంసీ పరిధిలోకి తీసుకురావడం కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. రైతులకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో కొనుగోళ్లు చేయాలని సూచించారు. పంటకు మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం ఉండాలని పేర్కొన్నారు. ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లో ఆర్డీఎస్ చివరి ఆయకట్టు కింద ఉన్న పంటలు ఎండుతున్నాయని, సాగునీరు విడుదల చేయాలని ఎమ్మెల్యేను రైతులు కోరగా స్పందించిన ఆయన ఆర్డీఎస్ శాఖ అధికారులు, కలెక్టర్‌తో సాగునీటిపై మాట్లాడానని త్వరలోనే చివరి ఆయకట్టుకు సాగునీరు వస్తుందని వివరించారు.