హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో (Congress) పొత్తుపై వామపక్షాలు (Communist Parties) జంకుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లడం కంటే.. ఒంటరిగా పోటీ చేయడమే నయమని క్షేత్రస్థాయి వామపక్ష శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పొత్తులపై రాష్ట్ర నాయకత్వానికి జిల్లా, క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలు ఇదే అభిప్రాయాన్ని రాష్ట్రనేతలకు తేల్చిచెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్, ఎంఐఎం, తెలంగాణ జనసమితి, సీపీఐ మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. సీపీఎం మాత్రం బీజేపీకి వ్యతిరేక వైఖరితో అంశాల వారీగా కాంగ్రెస్, సీపీఐతో కలిసి పని చేస్తున్నది. ఈ నేపథ్యంలో స్థానికంలో పొత్తులు ఎలా ఉంటాయని రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ విషయంపై ఈ నెల 8న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు వామపక్షాలనేతలు చెప్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్న వామపక్షాల రాష్ట్ర నాయకులు జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి కావొస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని సీపీఐ, సీపీఎం క్షేత్రస్థాయి నాయకులు, శ్రేణులు రాష్ట్ర నేతలకు స్పష్టంచేసినట్టు సమాచారం. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వ ఘోర వైఫల్యం కనిపిస్తున్నదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. వృద్ధులు, దివ్యాంగులు, మహిళల సంక్షేమం విషయంలోనూ కాంగ్రెస్ సర్కారు మోసానికి పాల్పడ్డదని స్పష్టంచేశారని సమాచారం. రైతుల భూములు లాక్కోవడం, అరెస్టులు, వేధింపులు, యూరియా సమస్య, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం సహా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతీ రంగంలో విఫలమైందని, ఈ నేపథ్యంలో హస్తం పార్టీతో స్నేహం వల్ల మునిగిపోవడం ఖాయమని జిల్లాల నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపడుతూ.. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం సరికాదనే అభిప్రాయం శ్రేణుల నుంచి వ్యక్తమైందని తెలిసింది.
ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో వామపక్షాలకు కొంత బలం ఉంది. ఆ జిల్లాల నుంచి కాంగ్రెస్కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి అక్కడ వామపక్షాలు బలపడటాన్ని కాంగ్రెస్ నేతలు ఇష్టపడరని లెఫ్ట్ లోకల్ క్యాడర్ భావిస్తున్నది. స్థానిక అంశాల వారీగా జరిగే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పొత్తుకు దూరంగా ఉండి, ఎన్నికలు ముగిసిన తర్వాత పొత్తుల సంగతి ఆలోచిద్దామని గ్రామ, డివిజన్ స్థాయి నాయకులు… జిల్లా స్థాయి నాయకత్వానికి స్పష్టంచేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో శ్రేణులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని వామపక్షాల రాష్ట్ర నాయకత్వాలు మొగ్గుచూపుతున్నాయని ప్రచారం జరుగుతున్నది. అధికార పార్టీతో కలిసి వెళ్తే.. ఎన్నికల ఖర్చులు తప్పడంతోపాటు.. ప్రభుత్వంతో అవసరమైన పనులు పూర్తి చేసుకోవచ్చనే ఆలోచనలో నాయకులు ఉన్నట్టు సమాచారం.