డిచ్పల్లి, మార్చి 12: నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నిస్తుండడంపై విద్యార్థి, ఉద్యమ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణ పేరిట ఉన్న ఏకైక యూనివర్సిటీకి ఈశ్వరీబాయి పేరు పెట్టాలని ప్రతిపాదిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం తక్షణమే ప్రయత్నాలను విరమించుకోవాలని లేకపోతే భారీ ఉద్యమం తప్పదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. బీఆర్ఎస్వీ, ఏబీవీపీ,ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ తదితర సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో 2006లో ఏర్పాటైన యూనివర్సిటీకి అప్పట్లోనే తెలంగాణ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. స్వరాష్ట్ర కల సాకారమై దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఇప్పుడు రేవంత్ సర్కారు ‘తెలంగాణ’ పదమే లేకుండా చేసే చర్యలకు పూనుకోవడం విమర్శలకు తావిస్తున్నది. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చడమంటే రాష్ర్టాన్ని అవమానించడమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈశ్వరీబాయి అంటే అందరికీ గౌరవమేనని, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితే పోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.
తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పుపై నిరసన వ్యక్తంచేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీలో రేవంత్ సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పుపై వచ్చిన నివేదికను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వీసీ యాదగిరిరావుకు వినతిపత్రం సమర్పించారు. ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, అలాంటి తెలంగాణకు ప్రతీకగా ఉన్న విశ్వవిద్యాలయ పేరు మార్చాలనుకోవడం సరికాదని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు అమృత్చారి అన్నారు. వర్సిటీకి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి పేరు పెట్టాలని ప్రతిపాదించటం దురదృష్టకరమన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోనూ నిరసనలు చేపట్టారు. తెలంగాణ పేరు కొనసాగించాలని కోరుతూ వీసీ యాదగిరిరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంతో చరిత్ర కలిగిన వర్సిటీ పేరు మార్చటమంటే ఈ రాష్ర్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడమే అవుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ విమర్శించారు.