హైదరాబాద్, ఆదిలాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి’ అంటూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామస్థులు మహారాష్ట్రలో ప్రచారాన్ని చేపట్టారు. ముక్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షి గాడ్గే, మాజీ ఎంపీటీసీ సుభాష్తోపాటు స్థానికులు బుధవారం కిన్వట్ నియోజకవర్గంలోని పాటోదా, ఇంజెగామ్ గ్రామాల్లో పర్యటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల హామీలను ఇచ్చి ఏవిధంగా మోసం చేసిందో వివరించారు. రైతు భరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.2,500, తులం బంగారం, పంటలకు బోనస్ తదితర హామీల పరిస్థితిని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా గ్యారెంటీలు అమలుకావడంలేదని ప్రజలకు వివరించారు. హామీలన్నీ అమలు చేశామంటూ సీఎం రేవంత్రెడ్డి మహారాష్ట్రలో అబద్ధాలు చెప్తున్నారని ప్రజలకు వివరిస్తున్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా ఐదు గ్యారెంటీలని నమ్మి ఓటు వేసి మోసపోవద్దని కోరారు.