హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు మరోసారి ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయొద్దని గతంలో పంజాగుట్ట పోలీసులకు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఈ కేసును కొట్టేయాలని, ఈలోగా తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జే రామచందర్‌రావు వాదన వినిపిస్తూ.. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానమిచ్చేందుకు ఫిబ్రవరి దాకా గడువు కావాలని కోరారు. దర్యాప్తునకు సహకరించేందుకు హరీశ్‌రావు సిద్ధంగా ఉన్నారనితెలిపారు. పిటిషనర్‌ను అరెస్ట్ చేయవద్దని గతంలో జారీచేసిన ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను 28కి వాయిదా వేశారు.