Sircilla | సిరిసిల్ల రూరల్ , మార్చి 17: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల బాలిక గురుకుల పాఠశాలలో సోమవారం విద్యార్థినిపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో విద్యార్థి నీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన గొట్టిముక్కుల డేవిడ్ రాజ్ – కృపారాణి దంపతుల కూతురు సువర్ణ (10) చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నది ఈ రోజు సాయంత్రం సమయంలో బాత్రూమ్కి వెళ్లేందుకు తరగతి గది నుంచి బయటకు వచ్చిన సమయంలో కుక్క ఒక్కసారిగా విద్యార్థినిపై దాడి చేసింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని కేకలు వేస్తూ పరుగులు తీయగా.. తోటి విద్యార్థినులు చెదరగొట్టడంతో ప్రాణాల నుంచి బయటపడింది. ఆ తర్వాత విద్యార్థిని హుటాహుటినా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో కుక్కల దాడిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ వీర్నపల్లి మండల అధ్యక్షుడు గజ్జెల ప్రశాంత్ డిమాండ్ చేశారు.
చిన్న బోనాల సంక్షేమ గురుకుల పాఠశాలలో కుక్కల దాడికి గురైన ఉదంతంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల సంక్షేమ గురుకులంలో కుక్కల దాడికి గురై చిన్నారి సువర్ణ తీవ్రంగా గాయపడిన సంఘటన జంతువుల కన్నా.. క్రూరంగా ఉన్న రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. కేసీఆర్ పాలనలో చదువుల కేంద్రాలుగా ఉన్న గురుకులాలు రేవంత్ రెడ్డి పాలనలో చావుకేకలు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రత్నాల్లాంటి 85 మంది గురుకుల విద్యార్థులను తెలంగాణ కోల్పోయిందన్నారు. గురుకుల బిడ్డల మరణాలు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని, ఈ పాపం రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదన్నారు. పాలన చేతకాని ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ అని చెప్పుకోవడం మీద, ప్రకటనల పేరుతో ప్రచారం చేసుకుంటూ పాలను గాలికి వదిలేసి, సొంత డబ్బాపై పెడుతున్న శ్రద్ధలో కనీసం గురుకులాల విద్యార్థుల భద్రతపై పెట్టాలని సూచించారు. విద్యాశాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా అభం శుభం తెలియని చిన్నారులను కాపాడలేకపోతే చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదన్నారు. గురుకుల బిడ్డల రోదనలే శాపాలై నీతి లేని మీ పాలనకు చరమగీతం పాడుతాయని హెచ్చరించారు.