పుల్కల్, ఆగస్టు 19 : గురుకుల విద్యార్థులు విషజ్వరాల బారినపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యార్థుల ఆరోగ్యంపై స్థానిక ఎమ్మెల్యే అయిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఏ మాత్రం చొరవ చూపడం లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు. మంగళవారం ఆయన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
‘మీకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? అస్వస్థతకు కారణమేంటి? అని ఆరాతీశారు. పాఠశాలలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, మంత్రి దామోదర రాజనర్సింహకు విద్యార్థుల బాధలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన నియోజకవర్గంలో సుమారు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా మంత్రి స్పందించడం లేదని మండిపడ్డారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్ సాయికిరణ్కు సూచించారు.