కాగజ్ నగర్, ఫిబ్రవరి 24 : కాంగ్రెస్‌కు ప్రజల ప్రాణాలంటే పట్టింపులేదని, వారికి ప్రజల సంక్షేమం కంటే ఎమ్మెల్సీ ఎన్నికలే ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవాచేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఈస్గం శివమల్లన్న ఆలయం సమీపంలోని ఇరుకు వంతెన వద్ద సోమవారం రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పిల్లల కుటుంబసభ్యులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుకైన వంతెనతో నెలకు రెండు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
అయినా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అందవెల్లి బ్రిడ్జి, సిర్పూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయని, ఇరుకు వంతెనల సమస్య పరిష్కరించలేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎల్బీసీ ఘటనలో 8 మంది ప్రమాదంలో ఉంటే ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.