హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసును క్రిమినల్ కేసుగా పరిగణించవద్దని ప్రధాన నిందితుడైన సీఎం రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టును కోరారు. ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల కింద విచారించాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో రేవంత్‌రెడ్డి పిటిషన్‌తోపాటు ఇదే కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ మరో నిందితుడు సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల తర్వాత విచారణ జరుపనున్నట్టు జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇదేవిధమైన మరో కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉన్నదని, ఆ తీర్పు వచ్చాక అందులోని వివరాలను పరిశీలించి ‘ఓటుకు నోటు’ కేసును విచారిస్తామని తెలిపింది.