తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతవ్ రేవంత్? తెలంగాణ తెచ్చినందుకా? అభివృద్ధి చేసినందుకా? మిమ్మల్ని, మీ దొంగ హామీలను ప్రశ్నిస్తున్నందుకా? బీఆర్ఎస్ను బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం.. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న మీ హామీలపై ముందు దృష్టి పెట్టండి. అహంకారంతో మాట్లాడిన రేవంత్ లాంటి నాయకులను బీఆర్ఎస్ చాలా మందిని చూసింది. ఎందరో ఎన్నో నీల్గిండ్రు. రెండున్నర దశాబ్దాలుగా బీఆర్ఎస్ నిలబడి, రేవంత్ లాంటివాళ్లను మట్టికరిపించింది.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా ప్రజలెవరూ జనవరి నెల కరెంటు బిల్లులు కట్టొద్దు. బిల్లులు కట్టొద్దని ఎన్నికలకు ముందు రేవంత్, కాంగ్రెస్ నాయకులే చెప్పిండ్రు. ఆ బిల్లుల్ని సోనియాగాంధీ కడుతుందని అన్నరు. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు సీఎం మాటల వీడియోలు చూపించండి. ఆ బిల్లుల్ని ఢిల్లీలోని సోనియా ఇల్లు 10 జన్‌పథ్‌కు పంపించండి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతాయని, సీఎం రేవంత్ కాంగ్రెస్ ఏక్నాథ్ షిండేగా మారతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రక్తమంతా బీజేపీదేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రేవంత్ చోటా మోదీగా మారారని విమర్శించారు. శనివారం తెలంగాణభవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను బొందపెడుతామన్న రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతవ్? తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? మిమ్మల్ని, మీ దొంగ హామీలను ప్రశ్నిస్తున్నందుకా? బీఆర్ఎస్ను బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం.. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న మీ హామీలను అమలు చేసే అంశంపై దృష్టి పెట్టండి. అహంకారంతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి లాంటి నాయకులను బీఆర్ఎస్ తన ప్రస్థానంలో చాలా మందిని చూసింది. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలామంది నీలిగిండ్రు. అయినా రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, రేవంత్ లాంటివాళ్లను మట్టికరిపించింది’ అని తెలిపారు. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఆయన వెంటపడుతున్నారని, దావోస్‌లో అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారని విమర్శించారు. అదానీతో రేవంత్‌రెడ్డి చేసుకొన్న ఒప్పందాల అసలు గుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే, రేవంత్‌రెడ్డి అదానీ కోసం అర్రులు చాస్తున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్.. ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్‌గా మారారని విమర్శించారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా ప్రజలెవరూ జనవరి నెల కరెంటు బిల్లులు కట్టవద్దని కేటీఆర్ సూచించారు. సీఎం, కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగానే ఉచిత విద్యుత్తు కోసం డిమాండ్ చేయాలని తెలిపారు. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు సీఎం మాటల వీడియోలు చూపించాలని కోరారు. కరెంటు బిల్లులు సోనియాగాంధీ కడుతుందని ఎన్నికలప్పుడు రేవంత్ చెప్పారని, ఇప్పుడు కరెంటు బిల్లులను ఢిల్లీలోని సోనియా ఇల్లు 10 జన్‌పథ్‌కు పంపించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలోని ప్రతి కరెంటు మీటర్‌కు వెంటనే గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కిరాయి ఇండ్లలో ఉండేవాళ్లకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే వదిలిపెట్టబోమని కేటీఆర్ స్పష్టంచేశారు.
బీజేపీతో బీఆర్ఎస్కు ఏరోజు పొత్తు లేదని, భవిష్యత్తులోనూ ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఐదు ఏండ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీతాఫల్మండి రైల్వేస్టేషన్లో లిఫ్ట్‌లను జాతికి అంకితం చేశారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకున్నది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వల్లనే బీజేపీ సీనియర్ నాయకులు హైదరాబాద్ పలు నియోజకవర్గాల్లో పోటీకి వెనుకంజ వేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని గుర్తుంచుకోవాలని అన్నారు.
ఓడినా, గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని, కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. 420 హామీలని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడుతామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.