దేవరుప్పుల, ఏప్రిల్ 23: కాంగ్రెస్, మిగతా పార్టీల 65 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణను నాశనం చేసిన ఆ పార్టీల నాయకులు నేడు అవాకులు, చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ అబద్ధాల కోర్లు, బ్రోకర్లని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు వారి బూటకపు మాటలు నమ్మేస్థాయిలో లేరని చెప్పారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో శనివారం డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు.
తాను మొదటిసారి పోటీ చేసినప్పుడు దేవరుప్పుల మండలం ఎడారిగా ఉండేదని, బీడుగా మారిన వాగును, రైతుల పరిస్థితిని చూస్తే ఏడుపు వచ్చేదని గుర్తుచేశారు. పొన్నాల లక్ష్మయ్య పదేండ్లు సాగునీటి మంత్రిగా ఉన్నా వాగుపై చెక్‌డ్యాంలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. నేడు అదే వాగుపై కేసీఆర్ ప్రభుత్వం 8 చెక్‌డ్యాంలను నిర్మించిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కొత్త బిచ్చగాళ్ల తీరు వచ్చిపోతున్నారని అన్నారు. రైతుల ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చూసిన బీజేపీ పాలకులు.. నేడు వారే దోషులుగా తేలారని చెప్పారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఓటుతో బీజేపీ, కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.