KTR | బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గులాబీ కండువా కాప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు తెలంగాణపై ఇష్టంతో పనిచేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది.. కేసీఆర్ వచ్చాక ఎలా మారిందో గుర్తుతెచ్చుకోవాలని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యలు పరిష్కరించి.. అందరికీ నాణ్యమైన విద్యుత్ అందజేశారని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, పార్కులు కట్టుకున్నామని పేర్కొన్నారు. మన రాష్ట్రం, మన ప్రజల కోసం పనిచేశామనిచెప్పారు. కరోనా సమయంలో కూడా 40 లింక్ రోడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కేసీఆర్ వినియోగించుకున్నారని అన్నారు. ప్రజలకు అలివికాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు.
కేసీఆర్ ప్రజలకు మంచి చేశారు కాబట్టే ఆయన్ను ప్రజలు మరిచిపోలేకపోతున్నారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధితో భూముల ధరలు పెరిగాయని అన్నారు. అప్పట్లో రూ.5లక్షలు ఉన్న భూమి.. 30 నుంచి 50 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ స్తంభించిందని పేర్కొన్నారు. రెండేళ్లలో రియల్ ఎస్టేట్‌ను తొక్కిపెట్టాడని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో భూముల రేట్లు తగ్గాయని అన్నారు. కళ్ల ముందటే ప్రజల ఆస్తి కరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని రేవంత్ ఆరోజే చెప్పాడని అన్నారు.
ప్రజలకు అలివికాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని అన్నారు. దేవుళ్లు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఒట్టు వేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడని తెలిపారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు రైతుబంధు ఇచ్చాడని తెలిపారు. కేసీఆర్ రైతుబంధుతో అగ్రవర్ణాలకు కూడా మేలు జరిగిందని అన్నారు. రైతు సంపద పెరిగితేనే అన్ని వర్గాలు ఆనందంగా ఉంటాయని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2000 చేశారని తెలిపారు. పెన్షన్ ఏమైందని అడిగితే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి వచ్చింది ఒకటే భాష.. అది బూతుల భాష అని ఎద్దేవా చేశారు. లాగుల్లో తొండలు ఇడుస్తా.. పేగులు తీసి మెడలో వేసుకుంటానని అంటారని అన్నారు.
రాష్ట్రం అప్పుల పాలైందని రేవంత్ రెడ్డి పదే పదే అంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్పుపై ఒక్కోకాంగ్రెస్ నేత ఒక్కోలా మాట్లాడతారని అన్నారు. ఒకరు రూ.6లక్షల కోట్లు, మరొకరు 7 లక్షల కోట్లు.. ఇంకొకరు 8లక్షల కోట్లు అని చెప్పారని తెలిపారు. దీనిపై బీజేపీ ఎంపీ కేంద్రాన్ని అడిగితే.. కేసీఆర్ రూ.2లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారని చెప్పారని గుర్తుచేశారు. కాగ్ చెప్పిన లెక్కల ప్రకారం బీఆర్ఎస్ చేసిన అప్పు 2లక్షల 80 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక హైడ్రా పేరిట గరీబోళ్ల ఇళ్లు కూలగొడతారు కానీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లు మాత్రం ఈ ప్రభుత్వానికి కనబడవని మండిపడ్డారు.
బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఏం సాధించారని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెల్వదని.. చెబితే వినడని ఎద్దేవా చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇంకా మూడేళ్ల అధికారం ఉంది.. ఇప్పటికైనా మంచి పనులు చేయాలని హితవు పలికారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని సూచించారు. నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. అశోక్ నగర్ వెళ్లడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని అన్నారు. రేవంత్‌రెడ్డి 70వేల ఉద్యోగాలు కాదు.. 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి ఫోజులు కొడుతున్నాడని విమర్శించారు.