హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్కు వినతిపత్రం అందజేశారు. ప్రమోషన్లలో, ఉన్నత విద్య అడ్మిషన్లలో దివ్యాంగులకు కోటా పెంపు, దివ్యాంగుల కార్పొరేషన్ ఉద్యోగులకు పీఆర్సీ వంటి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
వీటిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని వాసుదేవ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హాబిబ్ మియా, ప్రధానకార్యదర్శి సైదులు ముదిరాజ్, రోషన్ తదితరులు పాల్గొన్నారు.