హైదరాబాద్, మే 5 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు బెంబేలెత్తిస్తుండగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈనెల 7 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది.
మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదు అవుతున్నట్టు వివరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నట్టు పేర్కొన్నది. దీంతో జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయని తెలిపింది. వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠంగా 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయని తెలిపింది. ఎండల ధాటికి ఒక్క నిజామాబాద్ జిల్లాల్లో నలుగురు వడదెబ్బకు మృత్యువాతపడినట్టు వివరించింది. వచ్చే రెండ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నదని తెలిపింది.