హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కల్యాణలక్ష్మి పథకంపై కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డే అడ్డుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై మంత్రులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మి పథకానికి ప్రత్యేక చట్టం అవసరమని ప్రభుత్వం చెప్తున్న వాదన శుద్ధ తప్పని, మంత్రులు అన్ని అంశాలు తెలుసుకొని మీడియా ముందుకు రావాలని హితవుపలికారు. జీవోలు, చట్టాలకు తేడా తెలియకుండా మాట్లాడిన మంత్రులు రేవంత్‌రెడ్డి రాసిచ్చిన స్రిప్ట్ చదివి వెళ్లారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ప్రకారం ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలను జీవోల ద్వారా అమలు చేసే అధికారం ఉందని స్పష్టంచేశారు. దేశం లో 90 శాతం పథకాలు జీవోల ఆధారంగానే అమలవుతున్నాయని పేరొన్నారు.
మహాలక్ష్మి, గృహలక్ష్మి, మూసీ రివర్ డెవలప్మెంట్, పీఎం కిసాన్ వంటి పథకాల అమలును కూడా ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. శాసనసభ బడ్జెట్లో నిధులు కేటాయించి ఆమోదిస్తే సరిపోతుందని, ప్రతి పథకానికీ ప్రత్యేక చట్టం అవసరం లేదని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన పార్టీ నేతలు రాంచంద్రనాయక్, సుమిత్రానంద్, తుంగబాలు, చారులత, మమత, కల్వకుర్తి శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఒకో పబ్లిక్ మీటింగ్‌కు రూ.15 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తూ కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడానికే వాటిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
కల్యాణలక్ష్మి పథకంపై కేసు దాఖలైన వెంట నే సంబంధిత శాఖల నుంచి అధికారులు తమ అభిప్రాయాలు, రిమార్స్ పంపారని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తయిన తర్వా త కూడా న్యాయశాఖ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ సీఎం పరిధిలోనే ఉన్నారని, వారి ని కోర్టుకు వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1955లోని రామ్ జవా యా వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనం ఉన్న, ప్రాథమిక హకులకు భంగం కలిగించని సంక్షేమ పథకాలకు ప్రత్యేక చట్టం అవసరం లేదనే న్యాయపరమైన అంశాన్ని ప్రభుత్వం ఎందుకు వినిపించలేదని నిలదీశారు.
గతంలో దళితబంధు పథకంపై కేసు వచ్చినప్పుడు అప్పటి అడ్వకేట్ జనరల్ సమర్థంగా వాదించి పిటిషన్‌ను కొట్టివేయించారని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. బాల్య వివాహాలు, అప్పుల నుంచి పేద కుటుంబాలను బయటపడేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కేసీఆర్ ప్రభు త్వం తీసుకొచ్చిన పథకాలను రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అక్రమ కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కోట్ల రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టు న్యాయవాదుల సేవలను వినియోగిస్తున్న ప్రభుత్వం.. కల్యాణలక్ష్మి కోసం ఎందుకు ఉపయోగించడంలేదని ప్రశ్నించారు. ఏదైనా పథకంపై కోర్టు స్టే వస్తే, ప్రభుత్వం అప్పీల్ చేయకుండా పథకాన్ని నిలిపివేస్తే పేద ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.