Squats | స్క్వాట్స్ కాళ్లు, తొడలు, తుంటి కండరాలను బలోపేతం చేయడంతోపాటు రోజువారీ కదలికలకు ఉపయోగపడే సమర్థవంతమైన వ్యాయామం. అయితే స్క్వాట్స్ చేసేటప్పుడు మోకాళ్లలో నొప్పి వస్తే చాలామంది ఈ వ్యాయామం మోకాళ్లకు హానికరమని భావిస్తారు. వాస్తవానికి తప్పు పద్ధతిలో వ్యాయామం చేయడం, ఎక్కువ బరువులు ఉపయోగించడం, కదలికల్లో తగినంత నియంత్రణ లేకపోవడం, శరీర కదలికల సామర్థ్యం తక్కువగా ఉండడం లేదా వ్యాయామ తీవ్రతను ఒక్కసారిగా పెంచడం వల్ల ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా స్క్వాట్స్ చేసేటప్పుడు మోకాళ్లు లోపలికి వంగిపోకుండా చూసుకోవాలి. పాదాల దిశలోనే మోకాళ్లు సహజంగా కదిలేలా నియంత్రణతో వ్యాయామం చేయడం ముఖ్యం.
స్క్వాట్స్ చేసేటప్పుడు మోకాళ్లు పాదాల వేళ్లను దాటి ముందుకు వెళ్లకూడదనేది సాధారణంగా వినిపించే అపోహ. శరీర నిర్మాణం, చీలమండల కదలిక, స్క్వాట్ చేసే విధానం, కిందికి వెళ్లే లోతు వంటి అంశాలను బట్టి మోకాళ్లు సహజంగానే పాదాల వేళ్లను దాటి ముందుకు వెళ్తాయి. దాన్ని బలవంతంగా నిరోధించడం వల్ల తుంటి, వెన్నుపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అలాగే శరీర కదలికల సామర్థ్యం, కండరాల బలం సరిపోకుండా చాలా లోతుగా స్క్వాట్స్ చేయడం కూడా అసౌకర్యానికి కారణం అవుతుంది. అందువల్ల శరీరాన్ని అదుపులో ఉంచగలిగే స్థాయిలోనే కిందికి వెళ్లి, క్రమంగా కండరాల బలం, కదలికల సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
వ్యాయామంలో బరువులు, పునరావృతాల సంఖ్య లేదా వారానికి చేసే సెషన్లను ఒక్కసారిగా పెంచడం కూడా మోకాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. ముఖ్యంగా కొంతకాలం వ్యాయామానికి దూరంగా ఉండి తిరిగి ప్రారంభించే వారు జాగ్రత్తగా తీవ్రతను పెంచాలి. స్క్వాట్స్ సమయంలో పాదాలు నేలపై స్థిరంగా ఉండాలి. పాదాల వంపు ఎక్కువగా కుంగిపోవడం, సమతుల్యత కోల్పోవడం, శరీరాన్ని ముందుకు వంచడం వంటి తప్పులు చేయకూడదు. ఛాతీ, వెన్నెముకను నియంత్రణలో ఉంచుతూ, పొత్తికడుపు కండరాలను బిగించి, నెమ్మదిగా కిందికి వెళ్లి మళ్లీ పైకి రావడం సరైన పద్ధతి.
మోకాళ్లలో నొప్పి వచ్చినంత మాత్రాన స్క్వాట్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే తీవ్రమైన నొప్పి, నిరంతర నొప్పి, వాపు లేదా వ్యాయామం తర్వాత కూడా కొనసాగుతున్న అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే బరువును తగ్గించడం, స్క్వాట్ లోతును మార్చడం, పాదాల స్థితిని సవరించడం లేదా తాత్కాలికంగా వేరే వ్యాయామాన్ని ఎంచుకోవడం వంటి మార్పులు చేయవచ్చు. ముఖ్యంగా నొప్పి కొనసాగితే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. స్క్వాట్స్లో ముఖ్యమైనది ఎక్కువ బరువుతో లేదా ఎక్కువసేపు చేయడం కాదు.. సరైన పద్ధతిలో, శరీర సామర్థ్యానికి అనుగుణంగా క్రమంగా తీవ్రతను పెంచడం మంచి పద్దతి అని నిపుణులు తెలియజేస్తున్నారు.