CMRF | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): పేద రోగులకు వరంగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఇప్పుడు అసహాయంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి నెలన్నర గడిచినా ఒక్కరికీ ఆర్థిక సహాయ చెక్కులు అందలేదు. దాదాపు 80 వేల మందికి సంబంధించిన రూ.350 కోట్ల విలువైన చెక్కులను సర్కారు పంపిణీ చేయలేదు. దీంతో ఎంతోమంది పేద రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. పేదవారికి రోగం వస్తే దగ్గరలో ఉన్న దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. చికిత్స ఖర్చు ఆర్థిక స్థోమతకు మించి అయితే వివరాలను పొందుపరుస్తూ ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకుంటారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ నుంచి చెక్కుల జారీ నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చే ప్రమాదం ఉండటంతో అప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి చెక్కులను కూడా సిద్ధం చేశారు. ఇలా సిద్ధమైన చెక్కులు సుమారు 35 వేలు ఉన్నాయి.
వీటిని పంపిణీ చేసే సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ రావటంతో అధికారులు వాటిని ఆపేశారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 5న ముగిసింది. అప్పటికే సిద్ధంగా ఉన్న చెక్కులను కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోగుల కుటుంబాలకు పంపిణీ చేస్తుందని అంతా భావించారు. అయినా ఇప్పటికీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేపట్టలేదు. ప్రతి రోజు వందల మంది సెక్రటేరియట్ వద్దకు వచ్చి తమ సీఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి వాకబు చేస్తున్నారు.కేసీఆర్ సర్కారు పాలనలో సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందని కుటుంబం రాష్ట్రంలో దాదాపుగా లేదనే చెప్పవచ్చు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స తీసుకున్నా, ఆ పరిమితికి మించి ఖర్చయితే ఆ మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించే ఏర్పాటు చేశారు. దీంతో లక్షల మంది లబ్ధిపొందారు. సీఎంఆర్ఎఫ్ ఫైళ్లను ప్రతి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో అందజేసేవారు.
అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎంఆర్ఎఫ్ కింద సహాయం కోసం వచ్చేవారి దరఖాస్తులను నింపించటం, వాటిని ఫాలోఅప్ చేయించేందుకు ప్రత్యేకంగా తమ కార్యాలయాల్లో ఒక మనిషిని ఏర్పాటు చేసేవారు. సెక్రటేరియట్లో సైతం ప్రత్యేకంగా ఒక ఫ్లోర్లో ప్రజాప్రతినిధుల నుంచి, నేరుగా సీఎం కార్యాలయానికి వచ్చే దరఖాస్తులను భద్రపరిచేందుకు, బిల్లుల తనిఖీ, చెక్కుల జారీ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. వ్యవస్థ మొత్తం పకడ్బందీగా ఉండేది. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి రెండు నెలలలోపే చెక్కులను ఇంటికి పోస్టు ద్వారా పంపించేవారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారా అర్జీ పెట్టుకొంటే చెక్కును ఎమ్మెల్యే ద్వారా పంపించేవారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పేరుతో ఒక లేఖను కూడా జత చేసేవారు. అక్రమాలు జరిగాయని తెలిస్తే స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకొని సీఐడీ విచారణకు కూడా ఆదేశించి అక్రమార్కులకు చెక్ పెట్టింది.
అప్పులు తీర్చేదెట్లా?
అప్పోసొప్పో చేసి చికిత్స చేసుకున్న పేదలు.. డిశ్చార్జి అయ్యాక సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకొంటే రెండు నెలల్లోపే ఇంటికి చెక్కు వచ్చేది. ఆ డబ్బుతో తీసుకున్న అప్పులను తీర్చుకునేవారు. ఇప్పుడు సుమారు 80 వేల మంది సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకొన్నారు. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అంతకు రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నవారు కూడా ఉన్నారు. అంటే.. ఆరు నెలల క్రితానికి సంబంధించిన ఫైళ్లు కూడా సెక్రటేరియట్లోని సీఎంఆర్ఎఫ్ సెక్షన్లో ఉన్నాయి. 35 వేలకుపైగా చెక్కులు లబ్ధిదారుల పేర్లతో సిద్ధంగా ఉంటే మరో45 వేల దరఖాస్తులు వివిద దశల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా పూర్తయింది. వీటిపై కొత్త ప్రభుత్వం ఇంకా దృష్టిసారించలేదు. ఇవి విడుదల అయితేనే, పేదవాళ్లు తమ అప్పులు కట్టుకుంటారు.
మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎలా?
ఇప్పటికే జనవరి 18వ తేదీ వచ్చేసింది. మరో వారం పాటు సీఎం రేవంత్రెడ్డి అందుబాటులో ఉండరు. వచ్చాక బడ్జెట్ సమావేశాలతో బిజీ అవుతారు. ఆ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది. అంటే మరో నెలలోపు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలి.లేకపోతే మళ్లీ ఎన్నికల కోడ్ వచ్చి మే వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చే అవకాశం ఉండదు. ఇది పేద వర్గాలకు తీవ్ర ఇబ్బంది కలిగించే అంశం.
ఆలస్యం ఎందుకు?
అనధికారిక సమాచారం మేరకు.. చెక్కుల పంపిణీ ఎలా చేయలన్నదానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిసింది. ఈసారి ప్రతిపక్షంలో కూడా ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉన్నది. ఒక వేళ వీటిని పంపిణీ చేస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేల ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చి పంపిణీ చేపడితే వాళ్లకు క్రెడిట్ వెళ్తుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక మరో కోణం ఏమిటంటే.. ఎన్నికలకు ముందు వచ్చినవాటిల్లో మెజార్టీ దరఖాస్తులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చినవే. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ పాత దరఖాస్తులను పరిష్కరిస్తే ఆనాడు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే క్రెడిట్ పోతుందన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు తెలిసింది. కేవలం రాజకీయ కారణంతోనే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది.