హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. అయితే వీరిలో ఎక్కువ మంది అగ్రకులాలకు చెందినవారే ఉండటంతో అసమ్మతి చెలరేగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీని సీఎం చేస్తామని ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం ఇప్పుడు జిల్లాల అధ్యక్షుల నియామకాల్లో బీసీలను ఎందుకు విస్మరించిందని పలువురు నిలదీస్తున్నారు. హనుమకొండలో ఇటీవలి వరకు రెండు దఫాలుగా బీజేపీ జిల్లా అధ్యక్ష పదవిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన రావు పద్మ ఉన్నారు. తాజాగా కొలను సంతోష్‌రెడ్డిని ఈ పదవిలో నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకున్నది. హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని మరోసారి రెడ్డి సామాజికవర్గం వారికే కట్టబెట్టడంపై ఆ పార్టీలోని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.