హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఒకవైపు పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంటే.. కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల కుంపటి రాజుకుంటూనే ఉన్నది. తమ సిఫార్సులను పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదని, పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తమకు సామాజిక న్యాయం పేరుతో అవకాశాలను దూరం చేశారని కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఓ వైపు సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం పూర్తయి.. ప్రచారం ప్రారంభమైంది. ఇదే సమయంలో డీసీసీల విషయంలో నేతల మధ్య నెలకొన్న వివాదాలు సర్పంచ్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయనే భయం అధికార పార్టీలో చర్చనీయాశంగా మారింది.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలోకి అనుసంధానం చేసుకోవాల్సిన డీసీసీల వ్యవస్థలో గందరగోళం ఏ ర్పడటం క్యాడర్లో పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రాక ప్రాధాన్యం సంతరించుకున్నది. వా రం రోజులపాటు ఆమె రాష్ట్రంలోనే ఉంటారని, పార్టీ, ప్రభుత్వంలోని తాజా పరిణామాలపై ఆమె చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త, పాత డీసీసీలతో భేటీ అయి కొత్తగా నియామకమైన డీసీసీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం గాంధీభవన్లో జరిగే సమావేశానికి సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, కొత్త, పాత డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యదర్శులు, ఉపాధ్యక్షులు హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.