మహాదేవపూర్(కాళేశ్వరం), మే 14: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు (Saraswathi Pushkaralu) మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారుల ఏర్పాటు చేసిన హోర్డింగ్లు వివాదానికి దారితీశాయి. ఈనెల 15 నుంచి కాళేశ్వరంలో ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల పండుగ సందర్భంగా స్థానిక దేవాదాయశాఖ అధికారులు అత్యుత్సాహం అపచారంగా మారింది. పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు స్వాగతం పలుకుతూ కాలేశ్వరం బస్టాండ్, పరిసరాల వద్ద ఏర్పాటుచేసిన కటౌట్ పలు విమర్శలకు తావిస్తున్నది. ఆ కటౌట్ లో.. ప్రముఖుల పాదాల కింద సరస్వతీ దేవి చిత్రపటం పెట్టడం పట్ల పుష్కర భక్తులు చివాట్లు పెడుతున్నారు.
ఆలయ అధికారులకు ఏమాత్రం ధర్మబక్తి ఉండదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చదువుల తల్లి.. సాక్షాత్తు సరస్వతి దేవి పుష్కరాలు జరుగుతున్న వేళ ఇలాంటి అపచారం మంచిది కాదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.