హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): నర్సింగ్ విద్యలో (Nursing Schools) అక్రమాల దందా చర్చనీయాంశమైంది. ఒక మంత్రికి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఇటీవల ఎనిమిది నెలల్లోనే 30కిపైగా నర్సింగ్ స్కూళ్లకు అనుమతులు పొందినట్టు తెలిసింది. ఇందులో 20 స్కూళ్ల బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఒకే వ్యక్తికి ఇన్ని స్కూళ్ల అనుమతులు ఇవ్వడంతో అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు వ్యక్తి ఒక్కో స్కూలు అనుమతికి రూ.60 లక్షల వరకు ముట్టజెప్పి, మార్కెట్లో నర్సింగ్ స్కూళ్ల అనుమతులను రూ.కోటి నుంచి రూ.కోటీ 20 లక్షల వరకు అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి నర్సింగ్ స్కూళ్లకు అనుమతులు పొందాలంటే 100 పడకల సామర్థ్యం కలిగిన పేరెంట్ దవాఖానతో ఎంవోయూ చేసుకుని ఉండాలి.
అనుమతి పొందాలనుకునే సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ పొందాలి. మౌలిక వసతులు, క్లినికల్ శిక్షణ, హాస్టల్, బస్సు సౌకర్యం, బోధనా సిబ్బంది సరిపడా ఉండాలి. కాలేజీని ఏర్పాటుచేసిన రెండేండ్లలోగా సొంత భవనాన్ని కలిగి ఉండాలి. ఇవేవీ లేకుండానే సదరు వ్యక్తికి అనుమతులు మంజూరుకావడం గమనార్హం. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.50 వేల వరకు స్కాలర్షిప్ వస్తుండటంతో ఎంతైనా ఖర్చు చేసి అనుమతి పొందాలని కొంతమంది రూ.కోటికిపైగా ముట్టజెప్తున్నట్ట్టు తెలిసింది. సదరు మంత్రి సన్నిహితుడు హయత్‌నగర్‌లో ఒకే బిల్డింగ్‌లో 8, నల్లగొండలో ఒకే బిల్డింగ్‌లో 4 నర్సింగ్ స్కూళ్లను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 190 నర్సింగ్ స్కూళ్లు ఉండగా.. ప్రభుత్వ జీవో ప్రకారం ఇచ్చిన అడ్రస్‌లో నర్సింగ్ స్కూళ్లు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, అధికారులు నిబంధనలకు పాతర వేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి.
నర్సింగ్ స్కూళ్లలో డొల్లతనం
23 స్కూళ్లలో డొల్లతనంపై ఇటీవల డీఎంఈకి ఒకరు ఫిర్యాదుచేశారు. దీనిపై పారదర్శకంగా తనిఖీలు చేయాలని కౌన్సిల్ అధికారులను ఆదేశించారు. ఇక్కడే విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ జీవో ప్రకారం నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లిలో ఉండాల్సిన ఒక నర్సింగ్ స్కూలు.. నల్లగొండ పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్నట్టు బయటపడింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆరేండ్లుగా ఏడు వరకు స్కూళ్లు జీవోలో తెలిపిన అడ్రస్‌లో లేవు. వీటన్నింటినీ మొయినాబాద్‌లోని ఒకే బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు తనిఖీల సందర్భంగా ఆయా కాలేజీలు ఫేక్ ఫ్యాకల్టీని నియమించుకుని వారికి ఒక్కొక్కరికి రూ.3వేల వరకు ముట్టజెప్తున్నట్టు తెలిసింది.
తనిఖీల సమయంలో బోధ నా సిబ్బంది స్వాన్ అఫిడవిట్ (జాయినింగ్ రిపోర్టు, ఆఫర్ లెటర్)ను తనిఖీ చేయాల్సి ఉండగా.. అధికారులు మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్టు రిపోర్టు ఇస్తున్నట్టు ఆ రోపణలున్నాయి. ఫిర్యాదులు అందిన 23 స్కూళ్లతోపాటు రాష్ట్రంలో మరో 16 నర్సింగ్ స్కూళ్లదీ ఇదే పరిస్థితి. వనస్థలిపురంలో నిర్వహిస్తున్న ఒక నర్సింగ్ స్కూలు స్థానికంగా ఉన్న ఒక కార్పొరేట్ దావాఖానతో పేరెంట్ హాస్పిటల్‌గా ఒప్పందం కుదుర్చుకోగా, సదరు దవాఖాన నర్సింగ్ విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా సదరు కార్పొరేట్ దవాఖానా ఒక్కో విద్యార్థికి రూ.7వేలు చొప్పున యాజమాన్యానికి ముట్టజెప్తున్నట్టు తెలిసింది. బయటినుంచి నర్సులను నియమించుకుంటే వారికి రూ.15-20 వేల వరకు ఇవ్వాల్సి వస్తుందని ఈ ఎత్తుగడ వేసినట్టు సమాచారం.
చక్రం తిప్పుతున్న ఆ ముగ్గురు
ఈ మొత్తం వ్యవహారంలో తనిఖీలకు వెళ్లిన ప్రతిసారీ ఒక్కో నర్సింగ్ స్కూలు నుంచి ఓ ఉన్నతాధికారికి రూ.రెండు లక్షల వరకు డబ్బులు ముడుతున్నట్టు తెలుస్తున్నది. సదరు ఉన్నతాధికారిని నర్సింగ్ స్కూళ్ల మేనేజ్మెంట్లు అన్నివిధాలుగా కాపాడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఓ సీనియర్ అసిస్టెంట్, మరో కంప్యూటర్ ఆపరేటర్ తనిఖీల వ్యవహారాన్ని తమ కనుసన్నల్లో చక్కబెడుతున్నట్టు తెలిసింది.