హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరూ ఆ నాయకుడి గురించే మాట్లాడుకుంటున్నా రు. అనుకోని అవకాశంతో పెద్ద పదవిలోకి వచ్చిన ఆ నేత తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది. ఆ నేత తీరుపై గుర్రుగా ఉన్న సీనియర్లు కొందరు ఇప్పటికే హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కాకుండా కేవలం తన కోసమే పార్టీని వాడుకుంటున్నాడని ఆ నేతపై ఫిర్యాదు చేశారు. పార్టీలో పెద్దపదవిలో ఉన్న ఆయనకు పెద్ద బంగళా ఇప్పించే బాధ్యతను ఓ మంత్రి తీసుకున్నారు. ఏకంగా మంత్రుల నివాస ప్రాంగణంలోనే ఓ బంగళాను ఇవ్వాలని నిర్ణయించారు.
అనుకున్నదే తడవుగా ఆ బంగ్లాను మంత్రి పేరుపై అలాట్మెంట్ చేయించారు. ఇప్పుడు ఆ బంగ్లాకు మరమ్మతులు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.కోటి ఖర్చు చేస్తున్నట్టు అంచనా. కానీ, పనులకు ఆమో దం, బిల్లు మంజూరుపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, మంత్రి కినుకు వహించారు. దీంతో సదరు పార్టీ పెద్ద నేత పదిసార్లు సంబంధిత ఆర్థిక శాఖ అధికారులకు, మంత్రికి తన గోడు విన్నవించుకుంటున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది.
పార్టీ పదవిలో ఉన్న నేతకు ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి రీత్యా ఎమ్మెల్యే/ఎమ్మెల్సీల నివాస గృహ సముదాయంలో అపార్ట్మెంటు మాత్రమే కేటాయించేందుకు అవకాశం ఉన్నది. అయితే, ఈ నేత అక్కడ అపార్ట్మెంట్ తీసుకోవడంతోపాటు ఇక్కడ మంత్రుల నివాస ప్రాంగణంలోని బంగ్లా కూడా వాడుకునేందుకు పెద్ద స్కెచ్ వేసినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. అపార్ట్‌మెంట్‌ను క్యాంప్ కార్యాలయంగా మార్చేసుకున్నాడని పలువురు అంటున్నారు.
సదరు పెద్ద నేత ప్రభుత్వం మనదే కదా అని కరాటే పోటీలకు కోటిన్నర ఇవ్వాలంటూ ప్రతిపాదన పెట్టారు. ఏకంగా ముఖ్యమంత్రికే ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కరాటే పోటీలకు కూడా ఇంత పెద్దఎత్తున ప్రభుత్వం సొమ్మును విడుదల చేయాలని కోరడం పెద్ద నేతకే చెల్లిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఆ పెద్ద నేతకు పదవి వచ్చినప్పటి నుంచి జిల్లాలు తిరగడం తక్కువ.. ఢిల్లీకి, విదేశాలకు తిరగడమే ఎక్కువ అని కార్యకర్తలు వాపోతున్నారు.
జిల్లాల్లో కమిటీలు లేవు.. రాష్ట్ర స్థాయిలో పార్టీ పటిష్ఠానికి చేసిందేమీ లేదు కానీ.. పర్యటన లతోనే కాలం గడుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇదే విషయమై పార్టీలోని ఓ వర్గం నేతలు ఢిల్లీలోని హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. పార్టీలోని ఓ కీలక నేత ఇప్పటికే రెండుసార్లు పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా పార్టీ పెద్ద నేత తీరుపై అసహనం వ్యక్తం చేశారు.