KTR | తెలంగాణ ఏర్పడిన నాడు మనం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పారిశ్రామికవేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి ఉండేదని.. మరోవైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి ఉందని గుర్తు చేశారు. సిరిసిల్లలో కూడా పవర్ లూమ్ పరిశ్రమ కరెంట్‌తోనే ముడిపడి ఉందన్నారు. ఇక్కడ కూడా కరెంట్ లేక ఎంతో మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రతి మనిషికి విద్యుత్‌తో విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు.
విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు స్వర్ణయుగంగా మారిందని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన 10 నెలల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని తెలిపారు. దానికి తోడు ఇప్పుడు కరెంట్ ఛార్జీల వాతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాలకులకు విజన్ ఉంటే.. సంపద పెంచి పేదలకు పంచాలి.. కానీ.. ప్రజలపై కరెంట్ చార్జీల భారం మోపి.. సంపద పెంచుకోవాలనే ఆలోచన చేయటం దుర్మార్గమని అన్నారు. డిస్కమ్ లంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలే తప్ప ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదని సూచించారు. విద్యుత్ అంటే వ్యాపారం కాదు.. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రమని అన్నారు. విద్యుత్ సంస్థల బలోపేతం కోసం చేసే ఖర్చు భారం కాదని.. అది ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. అదనపు ఆదాయం కోసం.. 18 వేల కోట్ల అదనపు భారం మోపాలన్న కాంగ్రెస్ సర్కారు ఆలోచనే ప్రజా వ్యతిరేకమైనదని విమర్శించారు. విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన చార్జీలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని కోరారు. వివిధ కారణాలు చెప్పి 963 కోట్లు అప్ ఛార్జీలను ప్రజలపై భారం వేయాలనుకోవటం సరికాదని హితవు పలికారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా తక్షణం రూ. 12 వందల కోట్లు పెంచుకోవటంతో పాటు డిస్కంలు చేసిన 9 ప్రతిపాదనలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ అధికారంలో ఉన్న్పపుడు పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి భారం వేయలేదని కేటీఆర్ గుర్తుచేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్ ఉచితంగా నీళ్లు ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి భారం వేయలేదని అన్నారు. సిరిసిల్లలో నేతన్నలకు 10 హెచ్ పీ మీద 50 శాతం సబ్సిడీ కూడా ఇచ్చామని అన్నారు. ఇప్పుడు 10 హెచ్ పీలను 30 హెచ్ పీ ల వరకు పెంచి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఇళ్లకు 300 యూనిట్లకు దాటితే ప్రస్తుతం ఉన్న రూ. 10 ఫిక్స్డ్ ఛార్జీలను 50 కి పెంచాలని చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
ఒక్క సెస్ పరిధిలోనే తీసుకుంటే లక్షా 20 వేలకు పైగా కనెక్షన్లు ఉంటే 75 వేల కనెక్షన్ల వరకు ఎండకాలంలో 300 యూనిట్లకు పైగా వాడుతున్నారని కేటీఆర్ తెలిపారు. కరెంట్ వినియోగమనేది గతంతో పోల్చితే చాలా వరకు పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు డిస్కంలు చేసిన ప్రతిపాదన పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉందని విమర్శించారు. ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. 11కేవీ, 33కేవీ, 220 కేవీ కింద నడిచే పరిశ్రమలకు సంబంధించి అన్నింటిన ఒకే కేటగిరీ లోకి తీసుకురావడం అసంబద్ధమని తెలిపారు. అదానీ ఒక ఫ్యాక్టరీ పెడితే వారికి వర్తించే కేటగిరీనే మా సిరిసిల్లలో సాంచాలు నడిపే పరిశ్రమకు ఉంచాలనుకోవటం హేతుబద్ధమైన నిర్ణయం కాదని అన్నారు. పరిశ్రమలకు సంబంధించి కరెంట్ ను అన్నింటిని ఒకే గాటున కట్టడమంటే సూక్ష్మ చిన్న, మధ్య పరిశ్రమలకు ఉరి వేస్తున్నట్లే అని అన్నారు. ఈ విధమైన కుట్ర చేస్తూ చిన్న పరిశ్రమలకు రాయితీ ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ద నిర్ణయాలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటు పడిందని.. చాలా పరిశ్రమలు తరలిపోతున్నాయని తెలిపారు. ఇంకా ఛార్జీలు పెంచితే పరిశ్రమలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు బేంబేలెత్తేపోతాయని తెలిపారు. కుటీర, చిన్న, పెద్ద పరిశ్రమలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిస్కంలు చేసిన ప్రతిపాదనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 12 వందల కోట్లు భరించిందని.. ఈ ప్రభుత్వం ఎందుకు భరించదని కేటీఆర్ ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని తెలిపారు. 10 హెచ్ పీ వరకు సిరిసిల్ల నేతన్నలకు సబ్సిడీ ఇచ్చామన్నారు. నాయి బ్రహ్మణులు, రజకులకు, ఎస్సీ, ఎస్టీ లకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేశామని తెలిపారు. పదినెలలకే ఎందుకు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని నిలదీశారు.