హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించి తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న పారా క్రీడాకారులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తున్నది. మిగతా క్రీడాకారులకు ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక కోటాను అమలు చేస్తున్న ప్రభుత్వం, పారా క్రీడాకారులకు మాత్రం ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. దీంతో దివ్యాంగ క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో క్రీడాపాలసీ
బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడారంగానికి సముచిత ప్రాధాన్యమిచ్చింది. క్రీడల్లో రాణించినవారికి ప్రోత్సాహకాలిచ్చి వెన్నుతట్టింది. 2023లో మెరుగైన క్రీడా పాలసీ రూపొందించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించిన క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2 శాతం కోటా ఇచ్చింది. ఇందుకు సంబంధించి జీవో 74 జారీ చేసింది. కానీ సాధారణ ఎన్నికలు రావడంతో పాలసీ అమలు వాయిదాపడ్డది.
రేవంత్ పాలనలో అన్యాయం
జీవో 74 ప్రకారం నియామకాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన దివ్యాంగ క్రీడాకారులకు 2 శాతం కోటాలో ఉద్యోగ అవకాశం కల్పించాలి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. 2 శాతం రిజర్వేషన్లను కేవలం సకలాంగ క్రీడాకారులకే అమలు చేస్తున్నది. ఇటీవలి ఏఈఈ, గ్రూప్-1 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద సకలాంగ క్రీడాకారులనే పరిగణనలోకి తీసుకున్నది.
నిర్లక్ష్యం వీడకుంటే కార్యాచరణ ప్రకటిస్తాం
ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగ క్రీడాకారులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం అన్యాయం. కఠోరంగా సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను విస్మరించడం సమంజసం కాదు. ఇటీవల చేపట్టిన నియామకాల్లో దివ్యాంగ క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా కేటాయించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
– మహేశ్నాయక్, వికలాంగుల ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్