చట్టవిరుద్ధంగా సంపాదిస్తున్న డబ్బును తమ ఖాతాలకు చేరవేసేందుకు సైబర్ మోసగాళ్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. కమీషన్ల ఆశ చూపుతూ మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా కోట్లు దారి మళ్లిస్తున్నారు. ఇందుకు తెలంగాణను కేంద్రంగా ఎంచుకొని ఇక్కడి అమాయకులను ఇరికిస్తున్నారు.
Cyber Crime | హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి వందల కోట్లు చేతులు మారుతున్నాయి. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించిన సైబర్ నేరగాళ్లు.. మనవాళ్లను నమ్మించి మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ తీయించి.. ప్రతిరోజూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆ కొల్లగొట్టిన డబ్బును ఏకంగా క్రిప్టోలోకి మార్చి.. సైబర్ కింగ్‌పిన్‌లకు పంపుతున్నారు. ఈ తతంగమంతా మొన్నటి వరకు రహస్యంగా జరిగినా.. ఇటీవల సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ స్కామ్‌ను బయటపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా కొన్ని అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుంచి భారీగా డబ్బులు విత్ డ్రా అయిన ఘటనలు బ్యాంకు అధికారుల దృష్టికి రావడంతో.. వారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు సమాచారం ఇచ్చారు. కొత్త తరహా మోసాలపై లోతుగా విచారించడంతో చైనా, దుబాయ్‌లో ఉంటున్న కింగ్పిన్లు ఈ సైబర్ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ స్కామ్‌ను ఎలా చేపట్టాలో చైనా కింగ్పిన్లు బోధిస్తుండగా దుబాయ్‌లో ఉండే మరికొందరు హైదరాబాద్‌లోని సైబర్ స్లీపర్‌సెల్స్‌తో పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు.
మనోళ్లు సమిధలా? నేరస్తులా?
దుబాయ్, చైనా కింగ్పిన్లు చెప్పిట్టుగా కమీషన్ల కోసం కరెంట్ బ్యాంకు అకౌంట్లు తీయిస్తున్న తెలంగాణకు చెందిన సైబర్ స్లీపర్‌సెల్స్ సమిధలుగానే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. పేదలను గుర్తించడం, వారి ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయించి, కమీషన్లు ఇవ్వడం, ఆ డబ్బును క్రిప్టోగా మార్చడంలోనూ వీళ్లే కీలకంగా ఉండటంతో నేరస్తులుగా కూడా పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న ఈ మ్యూల్ అకౌంట్ల వ్యవహారంపై దృషి సారించి, లావాదేవీల వివరాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సైబర్ నేరాల ద్వారా సంపాదించిన రూ.175 కోట్లను హైదరాబాద్‌లోని శంషీర్‌గంజ్ ఎస్బీఐ బ్రాంచ్ నుంచి పలు దఫాలుగా విత్‌డ్రా చేసి, క్రిప్టోగా మార్చిన సైబర్ రాకెట్లో కీలకమైన కింగ్‌పిన్‌లను అరెస్టు చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు చెబుతున్నారు.
అత్యాశతో కోట్లు నష్టం
హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు రూ.8.6 కోట్లు మోసపోయిన ఘటన మరువక ముందే.. ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ.13.26 కోట్లను కొల్లగొట్టారు. సామాన్యుల నుంచి చిల్లరే వస్తుండటంతో.. కొత్తగా ఆన్లైన్ వేదికగా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టేవారి ఖాతాల్లో లక్షలు, కోట్ల రూపాయలు ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. చిటాల పేరిట మెసేజ్‌లు పంపి, నకిలీ సైట్ల లింకులు పెట్టి ఉన్నది మొత్తం ఊడ్చేస్తున్నారు. పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితులైతే ఆపరేటర్లు మొదట్లో డబ్బును మోసపూరిత వ్యక్తి తాలూకు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ విధంగా నమ్మించి తమ ప్రీమియం, వీఐపీ ఛానెళ్లకు సభ్యత్వాన్ని పొందాలని ఒత్తిడి చేస్తారు. తద్వారా మరిన్ని ఎకువ లాభాలు వస్తాయని హామీ ఇస్తుంటారు.