హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు స మస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ అనేక కళాశాలలు శిథిల భవనాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయి. ఓ వైపు వసతుల లేమి వేధిస్తుండగా.. మరోవైపు బోధన, బోధనేతర సిబ్బంది కొరత పీడిస్తున్నది. రాష్ట్రంలో 422 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుంటే.. వీటిలో 398 కాలేజీలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. వీటిలో 18 కాలేజీలు శిథిల భవనాల్లో నడుస్తున్నాయి. మరో 24 కాలేజీలకు సొంత భవనాలు లేవు. ఇవి సమీప సర్కారీ స్కూళ్లల్లో కొనసాగుతున్నాయి. 182 కాలేజీలకే ప్రహరీలు ఉండగా, ఇప్పటికిప్పుడు మరో 227 కాలేజీలకు ప్రహరీలు అవసరం. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు కూడా అందడం లేదు. ఇప్పటివరకు 86 కాలేజీల్లో ఆర్వోప్లాంట్లు లేవు. ఈ నేపథ్యంలో 70 శాతం మంది విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల బాట పడుతున్నారు. ప్రైవేట్ కాలేజీల ఫీజు దోపిడీకి గురవుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నా ఒనగూరిన ప్రయోజనం శూన్యం. జూ న్ 1 నుంచి జూనియర్ కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో 1,724 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1,598 పోస్టుల భర్తీకి గత కేసీఆర్ సర్కారు నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో 1,392 జూనియర్ లెక్చరర్, 91 పీడీ, 40 లైబ్రేరియన్లు, 75 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే జేఎల్ రాత పరీక్షలు, గ్రూప్-4 రాత పరీక్షలు ముగిశాయి. ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నది. బోధనేత సిబ్బంది పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 2,710 పోస్టులుండగా, ప్రస్తుతం 1,339 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 801 బోధనేత సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 611 ల్యాబ్ అటెండెంట్ పోస్టులుంటే 465 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీర్వోల విలీనంలో భాగంగా 461 వీఆర్వోలు ఇంటర్బోర్డులో చేరారు. పలు కాలేజీల్లో కొంత మేర బోధనేతర సిబ్బంది కొరత తీరింది. అయినా మరో 2,426 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత 18 ప్రభుత్వ కాలేజీలు మంజూరయ్యాయి. ఈ కాలేజీల నిర్వహణకు బోధన, బోధనేతర పోస్టులు మంజూరుచేసే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభు త్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై సర్కారు ఇంత వరకు తేల్చలేదు. పక్కనున్న కాలేజీల నుంచి ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లను పంపించి కాలేజీలను నడపాల్సి వస్తున్నది. ఇంకా కాంట్రా క్టు, పార్ట్‌టైమ్ (అవర్లీ బేస్ట్), ఔట్సోర్సింగ్, గెస్ట్‌ఫ్యాకల్టీ విధానం ఇంటర్లో కొనసాగుతున్నది. ఇలా 2,314 లెక్చరర్లు పనిచేస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలిచ్చే కార్యక్రమానికి కేసీఆర్ సర్కారు శ్రీకారం చు ట్టింది. తెలుగు అకాడమీ ద్వారా ఏటా పాఠ్యపుస్తకాలను ముద్రించి ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.54 కోట్లు బకాయిపడ్డారు. మళ్లీ పు స్తకాలివ్వాల్సి ఉండటంతో మరో రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బకాయిలుండగా తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలిస్తుందా? లేదా అన్నది అనుమానమే.
ఇంటర్‌విద్యలో పర్యవేక్షణాధికారి పోస్టు లు కీలకం. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడుగురు డీ ఐఈవోలు మాత్రమే ఉన్నారు. 26 డీఐఈవో పోస్టులు మంజూరుచేయాల్సి ఉన్నది. ప్రిన్సిపాళ్లకు అదనపు బాధ్యతలు అప్పగించి నో డల్ ఆఫీసర్ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ పోస్టులను మంజూరుచేస్తేనే ఇంట ర్ విద్య పటిష్టమవుతుంది.
రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలది ఇష్టారాజ్యంగా మారింది. ఏటా 9 లక్షల మంది ఇంటర్ చదువుతుండగా, 6.5 లక్షల మంది ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లోనే చదువుతున్నారు. అంటే 70 శాతం విద్యార్థులు వీటిల్లోనే చదువుతున్నారన్నమాట. ఈ కాలేజీలపై ఇంటర్‌బోర్డు పర్యవేక్షణ కరువయ్యింది. ఈ ఏడాది పలు కాలేజీలు 40 శాతం ఫీజులు పెంచాయి. ఈ దోపిడిని అదుపు చేసే పరిస్థితి లేదు.