హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. బ్లాక్బోర్డుల స్థానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను బోధనకు వినియోగించనున్నారు. సర్కారు కాలేజీలన్నింటికి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను సమకూర్చాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
ఒక్కో కాలేజీకి రూ.20లక్షలు వెచ్చించి 6-8 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను సమకూరుస్తారు. రాష్ట్రంలో 420కి పైగా సర్కారు కాలేజీలుండగా, ఇందుకోసం రూ.40 కోట్లను అధికారులు ఖర్చుచేయనున్నారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్(టీజీటీఎస్) సంస్థతో టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు.