మక్తల్, నవంబర్ 28 : ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులకు గురిచేయడంతో గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గిడ్డంగుల గోదాం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మక్తల్‌తోపాటు మాగనూర్, కృష్ణ మండలాల నుంచి రైతులు ధాన్యాన్ని లారీల్లో నింపుకొని రైస్‌మిల్లర్ల వద్దకు వెళ్తే ధాన్యాన్ని తీసుకొని బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదు. దీంతో రైతులు ధాన్యాన్ని గిడ్డంగుల గోదాంకు తీసుకెళ్లారు. అధికారులు ధాన్యం తీసుకోవాలంటే సరైన తూకం ఉండాలని లారీలను బయటనే నిలబెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసిన రైతులు లారీలను అన్లోడ్ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో విసుగుచెంది గిడ్డంగుల గోదాం గేట్‌కు తాళం వేసి నిరసన చేపట్టారు. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్ జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ స్పందించి మక్తల్ నుంచి వచ్చిన 15 లారీల ధాన్యాన్ని నారాయణపేటకు పంపిస్తారని, అన్లోడ్ చేయించి ఇబ్బంది లేకుండా చూడాలని నారాయణపేట రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డికి సూచించారు. దీంతో రైతులు శాంతించి నిరసనను విరమించారు.