హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరితల రవాణా- జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తున్నది. గడ్కరీకి ఉన్న అధికారాలకు పీఎంవో కత్తెర పెట్టిందని, అందుకే ట్రిపుల్ఆర్కు మోక్షం లభించడంలేదని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం ఈ వాదనకు బలాన్ని చేకూర్చుతున్నది. ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులకు గత ఏడాది డిసెంబర్లో జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది.
ఆ టెండర్లు ఇంతవరకు తెరవకపోగా, ఈ మధ్యలో ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మార్చారు. మొదట నాలుగు లేన్లుగా నిర్మించాలని నిర్ణయించిన ట్రిపుల్ఆర్ను ఇప్పుడు ఆరు లేన్లుగా నిర్మించాలని నిశ్చయించారు. ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు వస్తే తప్ప టెండర్లు ఖరారుచేసే అవకాశం లేదని, అలైన్మెంట్ మారినందున మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, సుమారు 160 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదిత ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి ఇంకా భూసేకరణ పూర్తికాలేదు.
మరో ఐదు శాతం భూసేకరణ కావాల్సివుందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణంలో జాప్యంపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ హౌస్‌కమిటీ నూరు శాతం భూసేకరణ పూర్తికాకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని సిఫారసు చేసింది. ఈ సిఫారసు ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే సంగారెడ్డి, యాదాద్రి తదితర ప్రాంతాలలో ట్రిపుల్ఆర్ బాధిత రైతులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గతంలో భూములిచ్చేందుకు ఒప్పుకున్న రైతులు సైతం మారిన పరిస్థితులతో ఇప్పుడు తిరగబడుతున్నారు. దీంతో గతంలో అవార్డ్ పాస్‌చేసిన రైతులకు కూడా ఇప్పుడు నష్ట పరిహారం చెల్లించడం అత్యంత కష్టతరంగా మారింది.
ప్రధాని మోదీ, మంత్రి నితిన్ గడ్కరీకి మధ్య ఉన్న విభేదాలు ఈ ప్రాజక్టు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణమని అధికారవర్గాలు బలంగా అభిప్రాయపడుతున్నాయి. కొంతకాలంగా గడ్కరీ మంత్రిత్వశాఖను పీఎంవో నుంచి పర్యవేక్షిస్తున్నారని, ఏ పెద్ద ప్రాజక్టుకైనా పీఎంవో క్లియరెన్స్ వచ్చాకే అనుమతులు ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కేంద్రం తలుచుకుంటే ట్రిపుల్ ఆర్కు ఉన్న అడ్డంకులన్నీ ఒక్కరోజులో తొలగిపోతాయని, నష్టపరిహారం పెంచితే రైతులు కూడా శాంతిస్తారని పేర్కొంటున్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి అనేకసార్లు గడ్కరీని కలిసి ట్రిపుల్ఆర్కు అనుమతులు ఇవ్వాలని విన్నవించినా ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు కదలకపోవడానికి ఇదే ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు. పీఎంవో చేతిలోనే ట్రిపుల్ఆర్ వ్యవహారం ఉన్నదని తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి, ఇటీవల గడ్కరీని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రాజక్టులపై త్వరలో తాను, సీఎం ప్రధానమంత్రిని కలుస్తామని చెప్పడం గమనార్హం.
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఉప్పు-నిప్పులా నిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఇంత భారీ ప్రాజెక్టును రాష్ర్టానికి మంజూరుచేసి ఆ క్రెడిట్‌ను కాంగ్రెస్ సర్కారుకు కట్టబెట్టేందుకు కేంద్రం ఎంతమేరకు సిద్ధంగా ఉంటుందో చెప్పడం కష్టం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని కేంద్రాన్ని కోరుతున్నది. తమ ఇష్టారాజ్యంగా అలైన్‌మెంట్‌ను రూపొందించి అనుమతులకోసం కేంద్రానికి పంపారు. దీనిపై కూడా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు ముందుకు సాగడం కష్టమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.