జనగామ, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : జనగామ సబ్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లయ్య అలియాస్ మల్లేశ్ (38) నాలుగు రోజుల క్రితం గ్రామంలో స్నేహితుడితో జరిగిన స్వల్ప ఘర్షణలో పోలీసులు కేసు నమోదుచేశారు. అనంతరం జనగామ జైలులో రిమాండ్‌కు తరలించారు. జైలులో శనివారం బాత్రూంలు శుభ్రం చేసే బ్లీచింగ్ పౌడర్‌ను నీళ్లలో కలుపుకొని మల్లేశ్ అపస్మారక స్థితికి వెళ్లడంతో అధికారులు జనగామ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రాథమిక చికిత్స అందించి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.
జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఆత్మహత్యాయత్నం, వరంగల్ ఎంజీఎం దవాఖానలో మృతి చెందిన అంశాన్ని ఆదివారం వరకు అధికారులు గోప్యంగా ఉంచారు. గ్రామంలో పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాల్సిన చిన్న సమస్యను పెద్దది చేసిన పడకంటి బ్రహ్మచారి పోలీసులకు డబ్బులిచ్చి కేసు నమోదు చేయించి జైలుకు పంపించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బ్రహ్మచారి జైలు అధికారులకు డబ్బులు ఇచ్చి మల్లేశ్ చేత బలవంతంగా బ్లీచింగ్ పౌడర్ తాగించి చంపించారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు జనగామ సబ్ జైలు ఎదుట ధర్నా చేపట్టారు. దేవరుప్పుల పోలీసులు, జనగామ జైలు వార్డర్లు, జైలర్‌పై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య వారాల హైమ డీసీపీ రాజమహేంద్రనాయక్‌కు ఫిర్యాదు చేశారు.