కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 9: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధంతో వ్యక్తిగతంగా కలిసినప్పుడు కేపీహెచ్‌బీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను వివరించానని ఆ కాలనీకి చెందిన విమల తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ముఖ్యమంత్రికి విన్నవించినా ప్రజాభవన్‌కు పరుగెత్తాల్సిందే’.. అనే శీర్షికతో ఆదివారం ప్రచురితమైన వార్తను ఆమె ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తి జిల్లాకు వచ్చినప్పుడు కలిశానని, ఆయన సూచనల మేరకు ప్రజాభవన్‌కు వెళ్లి చిన్నారెడ్డికి విన్నవించినట్టు వివరించారు. తమను సంప్రదిస్తే వాస్తవాలు పూర్తిగా తెలిసేవని పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.33 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ జీవో-56 విడుదలచేశారు. ప్రతీ కార్మికుడికి రూ.లక్ష వరకు రుణమాఫీ జరిగినట్టు జీవోలో పేర్కొన్నారు.