హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): నాలుగేండ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. శేరీలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ కథనం ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన దంపతులు తమ నాలుగేండ్ల కూతురితో పుప్పాలగూడలోని బీఎస్ఆర్ లేబర్ కాలనీలో ఉంటూ ఓ నిర్మాణ సంస్థలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం తల్లితండ్రులిద్దరు చిన్నారిని గుడిసెలో వదిలి పక్కనే కొనసాగుతున్న నిర్మాణ పనులకు వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాలు, లేబర్ క్యాంప్‌లో వెతికినా ఫలితం లేకపోవడంతో రాత్రి 11 గంటలకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా బిస్వా అనే వ్యక్తి చిన్నారిని తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్వా ఒరా(25)ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను వెస్ట్రన్ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థలో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నట్టు తేలింది. చిన్నారికి చాక్లెట్ ఇప్పిస్తానంటూ ఆశ చూపించి, పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అనంతరం చిన్నారి గొంతు నులిమి, తలపై బండరాయితో మోది హత్యచేసినట్టు ఒప్పుకొన్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలం నుంచి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అనంతరం నిందితుడిపై పోక్సో, హత్య కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.