హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజును రూ. 3వేల నుంచి రూ. 3,075 పెంచుతున్నట్టు జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) సోమవారం ఒక ప్రకటనలో ప్రకటించింది. పెరిగిన ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నదని పేర్కొన్నది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి నుంచి నాన్-కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్ వార్షిక ఫీజు విధానం అమల్లోకి రాగా, ఇప్పటివరకు 56లక్షల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాలపై ఈ విధానం అమలవుతున్నదని వివరించింది. దీనివల్ల తరచూ ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం తప్పడంతోపాటు, వార్షిక పాస్ ద్వారా ఏడాదిలో 200 టోల్ ప్లాజాలను క్రాస్ చేయవచ్చని పేర్కొన్నది. రాజ్‌మార్గ్ యాత్రా యాప్ ద్వారా కానీ, ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా కానీ పాస్‌ను పొందవచ్చని వెల్లడించింది.