చండ్రుగొండ : ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
రోడ్డెక్కిన రైతన్నలు
వేరుశనగకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో రైతులు ధర్నా చేపట్టారు. రైతులు తెచ్చిన పల్లీకి వ్యాపారులు సరైన ధర చెల్లించకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు.
– కల్వకుర్తి రూరల్
పింఛన్లు పెంచండి మహాప్రభో..
పింఛన్లను పెంచండి మహాప్రభో అంటూ శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో వృద్ధులు, దివ్యాంగులు, పింఛన్‌దారులు నిరసన తెలిపారు. కడవెండి పోస్టాఫీసుకు వచ్చిన వీరంతా ప్లకార్డులతో నిరసన తెలిపారు.
– దేవరుప్పుల
రుణమాఫీ కాలేదని రైతుల నిరసన
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి యూనియన్ బ్యాంకు వద్ద గుండ్లపల్లి రైతులు శుక్రవారం నిరసన తెలిపారు. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదని మేనేజర్‌ను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు.
-శివ్వంపేట
విద్యుత్ శాఖలోని పోస్టులను భర్తీ చేయాలి
పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 4 వేల పోస్టులను వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి నేటికి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. జాబ్‌క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో విడుదల కావాల్సిన టీజీ ట్రాన్స్‌కో, టీజీ ఎంపీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్, అసిస్టెంట్ ఇంజినీర్, సబ్ ఇంజినీర్, జూనియర్ లైన్మెన్లకు సంబంధించి 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-సుల్తాన్‌బజార్