KTR | రాజన్న సిరిసిల్ల, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డలో జరిగిన ప్రమాదాన్ని సాకుగా చూపి కేసీఆర్‌పై కోపం, ద్వేషంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితం. కాంగ్రెస్ సర్కారు చేతగాని తనంతో రాష్ట్రంలో పంటలకు సాగునీరందక వ్యవసాయం సంక్షోభంలో పడింది.. 48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు సాగునీరందించకుంటే మంత్రి ఉత్తమ్ చాంబర్ ఎదుట ధర్నా చేస్తా’ అని హెచ్చరించారు. కేసీఆర్‌పై కోపం ఉంటే రాజకీయంగా తలపడాలిగాని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని హితవు పలికారు. ఇప్పటికే 450 మంది రైతులను పొట్టనబెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనేశ్వరం’ అంటూ తీవ్రంగా విమర్శించారు. సిరిసిల్ల, తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం జలాలతో చెరువులు, ప్రాజెక్టులు ఎర్రని ఎండల్లోనూ అలుగులు దుంకాయని గుర్తుచేశారు. సాగునీరందించి వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతులకు అండగా నిలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు.
ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చేరుకున్నారు. అధికారులు పెట్టిన అక్రమ కేసుతో జైలుకు వెళ్లి, కేటీఆర్ చొరవతో బెయిల్‌పై వచ్చిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని పరామర్శించారు. అక్కడి నుంచి అంకుసాపూర్‌లో నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడారు. కేటీఆర్ ఫొటో పెట్టుకున్నందుకు అధికారులు తొలగించిన టీస్టాల్ యజమాని శ్రీనివాస్‌కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ముస్తాబాద్ రెడ్డి సంఘం అధ్యక్షుడు కుంబాల మల్లారెడ్డి కూతురు వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ నాయకులు కాసర్ల మల్లేశం, బుర్ర శంకరయ్య కుటుంబాలను పరామర్శించి ఎల్లారెడ్డిపేట మండలం దేవునితండాకు చేరుకున్నారు. సాగునీరు అందక ఎండిన పంటలను పరిశీలించారు. రైతులను పరామర్శించి 48 గంటల్లో నీళ్లు వచ్చేలా అధికారులతో మాట్లాడుతానని ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి పోతుగల్‌కు చేరుకొని ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు జెల్ల దేవయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పంటలు ఎండి పోవడానికి కాలం తెచ్చిన కరువు ఎంత మాత్రం కాదని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి మధ్యమానేరు ద్వారా మల్కపేట రిజర్వాయర్‌ను నింపారని తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తే ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలాంటి గ్రామాల్లో పంటలు ఎండిపోయేవి కావన్నారు. మేడిగడ్డ పర్రెను రిపేరు చేసి నీళ్లిచ్చే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌లో చెప్పిన ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతుబంధు, రైతు భరోసా, బోనస్ ఏవీ ఇవ్వలేదని, కరెంటు, నీళ్లిచ్చే తెలివి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ వచ్చాక నీళ్లు పాతాళంలోకి, నిధులు ఢిల్లీకి పోతున్నాయని, నియామకాలు గాల్లో కలిశాయని ఎద్దేవాచేశారు. ప్రస్తుతం మధ్యమానేరులో 16 టీఎంసీల నీళ్లు నిలువ ఉన్నాయని, వాటిలో ఒక టీఎంసీ నీటిని కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్‌కు విడుదల చేస్తే సిరిసిల్ల ప్రాంత రైతులు వ్యవసాయం చేయడానికి సరిపోతుందని తెలిపారు. తాగునీటికి మరో మూడు టీఎంసీలు పోను, ప్రాజెక్టులో 13 టీఎంసీల నీరు ఉంటుందని చెప్పారు.
‘కేసీఆర్ పాలనలో ఏనాడూ పంటలెండింది లేదు. తాగునీటికి కరువన్నది చూడలేదు. కాంగ్రెస్ వచ్చినంక నీళ్లు లేక పంటలు ఎండి పోయి నష్టపోతున్నం’ అంటూ కేటీఆర్ ఎదుట దేవునిగుట్ట తండా రైతులు మొరపెట్టుకున్నారు. కాలువలో నీళ్లు రెండు రోజులిచ్చి బంద్ చేశారని, ఎండిన తమ పొలాల్లో పశువులకు మేతకు తోలుతున్నామని చూపిస్తూ కంట తడిపెట్టారు. వారి దైన్య స్థితిని చూసి చలించిన కేటీఆర్ ‘నేనున్నా’నంటూ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులను కాపాడాలని, సాగునీళ్లు విడుదల చెయ్యకుంటే అన్నదాతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని రైతులు, ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా రైతుల ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు ఫోన్‌చేసి నీటిని విడుదల చేయాలని సూచించారు. రెండు రోజుల్లో సాగునీటిని విడుదల చేస్తామని ఈఎన్సీ చెప్పారు.
‘సారీ రాజన్నా.. నా మీద కోపంతోనే నీ మీద కేసు పెట్టిండ్రు. పేదలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నరు. ఇలాంటి చండాలమైన ప్రభుత్వాన్ని నేనెక్కడా చూడలేదు. కేసీఆర్ కక్షసాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే వీళ్లు ఎవరూ మిగిలేవాళ్లు కాదు. బాధ పడొద్దు. ధైర్యంగా ఉండాలె. ఎవరికేం జరిగినా కాపాడుకుంటా.. అన్నివిధాలా అండగా ఉంటా’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘నా మీద కోపంతో కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు. నిజంగా అసైన్డ్ భూమి ఉంటే తప్పేంది? అసైన్డ్ భూమి అనేది పేదలకు ఇచ్చేదా? కాదా? పదేండ్ల కేసీఆర్ పాలనలో మేం కక్ష పూరితంగా వ్యవహరిస్తే వీళ్లంతా ఉండేటోళ్లా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసుకుంటూ ప్రజలకు అండగా ఉన్నం. కాంగ్రెసోళ్లు వచ్చినా.. బీజేపోళ్లు వచ్చినా వాళ్లకు లాభం చేసినమే తప్ప నష్టం చేయలేదు. ఒక పేదోడు టీ స్టాల్ పెట్టుకుంటే దాన్ని కూడా తీసేసిన దరిద్రపు ప్రభుత్వమిది’ అంటూ నిప్పులు చెరిగారు.
సిరిసిల్లకు చెందిన టీ స్టాల్ నిర్వాహకుడు శ్రీనివాస్‌కు కేటీఆర్ భరోసా కల్పించారు. క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను శ్రీనివాస్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ‘నేనెవరికీ ఏ అన్యాయం చేయలేదు సార్.. నాలుగేండ్లుగా కేటీఆర్ టీ స్టాల్ పేరుతో మీ ఫొటో పెట్టుకొని హోటల్ నడుపుకొంటున్న.. ఎవరో పెద్ద సారట.. బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చినప్పుడు హోటల్ మీద మీ ఫొటో చూసి నా హోటల్‌ను బంద్ పెట్టించిండు’ అంటూ వాపోయాడు. ఎందుకు మూసేయాలని అడిగితే ట్రేడ్ లైసెన్స్ లేదని సాకు చెప్పారని తెలిపాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సామగ్రితో సహా హోటల్ డబ్బాను మున్సిపల్ అధికారులు దొంగల్లా ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశాడు. దీంతో కేటీఆర్ మాట్లాడుతూ అన్ని రకాల అనుమతులతో రూ.10 లక్షలు ఖర్చయినా సరే మంచి టిఫిన్ సెంటర్ పెట్టిస్తానని భరోసా ఇచ్చారు. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు సంపాదించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ‘స్థానిక నాయకులు చెప్పిన చోట దుకాణం ఏర్పాటు చేసుకో. నా మీద కోపం నీ మీద పడకుండా లైసెన్స్, అడ్డా అన్నీ సరిగ్గా చూసి ఏర్పాటు చేసుకో’ అని సూచించారు. వారం పది రోజుల్లో హోటల్‌ను తానే వచ్చి ప్రారంభిస్తానని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ వెంట న్యాఫ్స్‌కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్, గూడూరి ప్రవీణ్, అందె సుభాష్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలున్నారు.
సిరిసిల్ల రూరల్/ సిరిసిల్ల టౌన్ : కేసీఆర్ హయాంలో మల్కపేట రిజర్వాయర్‌ను ట్రయల్ రన్ చేసి సిద్ధం చేశామని, రైతులు కూడా పంటలు సాగు చేసుకున్నారని, వారికి తప్పనిసరిగా నీళ్లందించాలని నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనీల్‌కుమార్‌కు కేటీఆర్ సూచించారు. క్యాంపు కార్యాలయంలో కోనరావుపేట ప్రజాప్రతినిధులు కేటీఆర్‌ను కలిసి పంటలు ఎండుతున్నాయని, రిజర్వాయర్‌ను నింపి నీళ్లివ్వాలని కోరడంతో మొదట మిడ్ మానేరు ఎస్ఈ సుమతితో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. తర్వాత ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు ఫోన్ చేశారు. మిడ్ మానేరు నుంచి వెంటనే రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేయాలని కోరారు. దీని కింద రైతులు 80 నుంచి 90 మోటర్లు తెచ్చుకొని, విపరీతంగా పంటలు వేసుకున్నారని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే దాదాపు 2 వేల ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పారు. ప్రస్తుతానికి 0.5 టీఎంసీ నీటిని సరఫరా చేస్తే పంటలను కాపాడవచ్చని, తర్వాత మరికొంత నీటిని విడుదల చేయాలని సూచించారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్దితో మాట్లాడానని తెలిపారు. మిడ్ మానేరు నుంచి మల్కపేటకు నీరు చేరేందుకు సుమారు 48 గంటలు పడుతుందని, మేడిగడ్డపై ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? లేదా? అని అడిగినప్పుడు ఎన్డీఎస్ఏ నిర్ణయం అంటూ చెప్పడంతో బదులుగా కేటీఆర్ ‘రాజకీయంగా మేము మాట్లాడిన విధంగా మీరు కూడా మాట్లాడితే ఎలా?’ అని ప్రశ్నించారు.