యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ధునుర్మాసోత్సవాలు (Dhanurmasam Utsavalu) అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి 5 గంటల వరకు శ్రీస్వామివారి ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగం హాల్లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో స్వామివారి నిత్య కైంకర్యాల సమయంలో స్వల్పంగా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 3.30 గంటలకు సుప్రభాతంలో స్వామివారిని మేల్కొలిపి 4 నుంచి 4.30 గంటల వరకు తిరువారాధాన, 4.30 నుంచి 5 గంటల వరకు తిరుప్పావై సేవాకాలం నిర్వహిస్తామన్నారు. 5 నుంచి 6 గంటల వరకు నివేదన, చాత్మర, 6 నుంచి 7 గంటల వరకు నిజాభిషేకం, 7 నుంచి 7.45 గంటల వరకు సహస్రనామార్చన చేపడతామన్నారు. ఉదయం 7.45 నుంచి స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభిస్తామన్నారు. ధునుర్మాసోత్సవాలలో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.