హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘దేశంలోనే తెలంగాణ పోలీస్‌శాఖ ప్రథమ స్థానంలో ఉన్నది. ఆ స్థాయిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీలుగా మీపైనే ఉన్నది’ అని డీజీపీ బీ శివధర్‌రెడ్డి ఉద్బోధించారు. హైదరాబాద్‌లోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో గురువారం నిర్వహించిన ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్ల శిక్షణ ప్రారంభ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర పోలీస్ కుటుంబంలోకి అడుగుపెడుతున్న అతి పెద్ద బ్యాచ్ (112 మంది) ఇదేనని చెప్పారు. 10 నెలల శిక్షణ క్రమశిక్షణ, సమయపాలన, దృక్పథంలో మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పోలీస్ అధికారి కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, దాని ఆత్మను అర్థం చేసుకోవాలని సూచించారు.
నిష్పాక్షికత, ఓర్పు, సానుభూతి వంటి విలువలే ఒక అధికారిని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయని ఉద్ఘాటించారు. డ్రిల్, వ్యాయామం, సమిష్టి కృషి ఇవన్నీ శిక్షణ పొందే వారిలో ఆత్మనిగ్రహాన్ని పెంచుతాయని చెప్పారు. క్రమశిక్షణ అంటే శిక్ష కాదు, సంసిద్ధత అని స్పష్టం చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సీఐ సెల్, టీజీసీఎస్బీ, ఈగల్ వంటి ప్రత్యేక విభాగాల ద్వారా తెలంగాణ పోలీస్ ఆధునిక పోలీసింగ్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్, భరోసా సెంటర్లు, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలకు నిదర్శనాలని తెలిపారు.
ఈ బ్యాచ్‌లో 38 మంది మహిళా అధికారులు ఉండటం మరో గర్వకారణమని, తెలంగాణ పోలీస్ భవిష్యత్తు మీరే అని డీజీపీ స్పష్టంచేశారు. 10 నెలల పాటు జరగనున్న శిక్షణకు సంసిద్ధులై ఉండాలని అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ సూచించారు. కార్యక్రమంలో టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం భగవత్, పోలీస్ కమిషనర్లు వీసీ సజ్జనార్ (హైదరాబాద్), సుధీర్‌బాబు (రాచకొండ), అవినాశ్ మహంతి (సైబరాబాద్), ఐజీపీలు ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎం రమేశ్, రమేశ్‌నాయుడు, అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు ఎన్ వెంకటేశ్వర్లు, మురళీధర్,జీ కవిత తదితరులు పాల్గొన్నారు.