హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల డీజీపీ బీ. శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ డీఎస్పీ నిఖత్ జరీన్‌ను అభినందించారు. మహిళల 51 కేజీల ఫైనల్స్‌లో తన ప్రత్యర్థిపై 5-0 తేడాతో ఘన విజయం సాధించడం ఆమె సామర్థ్యానికి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. ‘గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిన నిఖత్ జరీన్‌ను అభినందిస్తున్నాను. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శం’ అని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ కుటుంబం తరఫున నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీజీపీ ఆకాంక్షించారు.