హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణవ్యాప్తంగా నేరాల నమోదు పరిమితస్థాయిలోనే ఉన్నదని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నిరుడు 55 మందికి యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకోగా, ఈ ఏడాది ఆర్నెళ్ల్లలో 88 మందికి యావజ్జీవ శిక్ష పడిందని వెల్లడించారు. శనివారం తన కార్యాలయంలో నేరాలు, ఫంక్షనల్ వర్టికల్స్‌పై అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
డీజీపీ కార్యాలయంలో ‘ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ సపోర్ట్ సెంటర్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్‌ను ఉపయోగించడంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్టు అడిషనల్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. సమీక్షలో సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, అడిషనల్ డీజీలు పర్సనల్ సౌమ్య మిశ్రా, సంజయ్‌కుమార్ జైన్, ఐజీ షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.