హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గత ఏడాది కాలంలో జైళ్లకు వెళ్లిన ఖైదీల సంఖ్య కూడా భారీగా 31 శాతం పెరిగింది. 2023లో వివిధ నేరాలకు పాల్పడి 31,428 మంది జైళ్లకు వెళ్లగా.. నిరుడు ఆ సంఖ్య మరో 9,710 పెరిగి 41,138కు చేరినట్టు బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబందించిన కేసుల్లో నిరుడు అత్యధికంగా 6,417 మంది నిందితులను జైళ్లకు పంపినట్టు తెలిపారు. పోక్సో కేసుల్లో 3,750 మంది, హత్య కేసుల్లో 2,754 మంది జైళ్లకు వచ్చినట్టు పేర్కొన్నారు. మొత్తం ఖైదీల్లో 30 ఏండ్లలోపు వయసువారు 18,855 మంది, గ్రాడ్యుయేట్లు 750 మంది, పోస్ట్గ్రాడ్యుయేట్లు 225 మంది ఉన్నట్టు వివరించారు. క్షమాభిక్ష ద్వారా నిరుడు 213 మంది ఖైదీలు విడుదలయ్యారని, వారిలో 205 మంది జీవిత ఖైదీలున్నారని వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఆత్కూరు గ్రామంలో కొత్తగా 3.15 ఎకరాల్లో సబ్‌జైలును నిర్మించనున్నట్టు తెలిపారు. అనంతరం మీడి యా ప్రశ్నలకు ఆమె సమాధానమి స్తూ.. లగచర్ల రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలో జైలు అధికారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో జైళ్లశాఖ ఐజీలు మురళీబాబు, రాజేశ్, డీఐజీలు శ్రీనివాస్, సంపత్, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.