చేర్యాల, జూలై 14 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం( Mallanna temple) భక్తులతో(Devotees) కిటకిటలాడింది. ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
మల్లన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి దంపతులు
స్వామి వారిని హైకోర్టు జడ్జి ఎన్.వి.శ్రవణ్‌కుమార్ దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి తన సతీమణితో కలిసి స్వామి వారి దర్శనం కోసం కొమురవెల్లి క్షేత్రానికి రాగానే ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఎదురెగి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో న్యాయమూర్తి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాదాయశాఖ ఏసీ శివరాజ్ ఆధ్వర్యంలో అర్చకులు స్వామి వారి జ్ఞాపికను అందజేయడంతో పాటు ఆశీస్సులు అందించారు.
