Komuravelli | చేర్యాల, జూన్ 8 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల తరలివచ్చారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని సుమారు 25వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సిబ్బంది, ప్రధానార్చకుడు మహాదేవుడి మల్లికార్జున్, సూపరింటెండెంట్లు శ్రీరాములు, సురేందర్‌రెడ్డి, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు, భక్తులకు సేవలందించారు.