భీమదేవరపల్లి, జనవరి 16: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ(Kothakonda) వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గురు, శుక్రవారాల్లో లక్షలాది మంది భక్తులు(Devotees) స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించారు. కోరిన కోరికలు తీర్చాలని స్వామివారికి కోర మీసాలు సమర్పించుకున్నారు. తమ గండాలు తొలగిపోవాలని గండా దీపంలో నూనె పోశారు. వీరభద్రుని సన్నిధిలో కోడె ప్రదక్షిణ చేశారు. గుమ్మడికాయ మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ కట్టారు. భక్తులు అధికం కావడంతో శీఘ్ర దర్శనం, విఐపి క్యూలైన్లు సైతం కిక్కిరిసిపోయాయి. జాతరలోని దుకాణాలు, రంగులరాట్నం, సర్కస్ తదితర షాపులన్నీ రద్దీగా మారాయి. జాతరలో భక్తుల సౌకర్యార్థం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు వాటిల్లకుండా ఆలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ, ఈవో కిషన్ రావు పూర్తి సదుపాయాలు కల్పించారు.
మేకల బండి ప్రదక్షణ..
మకర సంక్రాంతి పర్వదినం గురువారం అర్ధరాత్రి ఆనవాయితీ ప్రకారం వరంగల్ జిల్లా వేలేరు కు చెందిన యాదవులు డబ్బు చప్పుళ్ళు, శివసత్తులు నృత్యాల మధ్య మేకల బండితో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఎడ్లబండ్లతో వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి గుట్టపైన కొలువుదీరిన వీరభద్ర స్వామి ఆత్మలింగం ఆలయంలో దివ్యాలంకరణ పూజలు జరిగాయి. గుట్టపైకి వెళ్ళిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
గుట్టపైకి వెళ్లి ప్రకృతి రమణీయతను వీక్షించేందుకు యువత పోటీపడ్డారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర లోని అతని ఇంటి నుంచి కొత్త కొండకు ఎడ్ల బండి రథం మకర సంక్రాంతి రోజున వెళ్లడం అనవాయతీగా వస్తుంది. ఈ ఏడాది సైతం ఎడ్ల బండి రథాన్ని అందంగా అలంకరించారు. శివ సత్తుల నృత్యాలు, మహిళల కోలాటాల నడుమ ఎడ్ల బండి రథాన్ని కొత్తకొండకు గ్రామస్తులు అంగరంగ వైభవంగా సాగనంపారు.
కొత్త కొండకు కొత్తపల్లి రథాలు..
బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే చందంగా కొత్తపల్లి నుంచి కొత్తకొండకు వెళ్లిన ఎడ్లబండ్లు రథాలను తలపించాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది సైతం సుమారు 72 వరకు ఎడ్లబండ్లను బంతిపూలతో వివిధ రంగులతో అందంగా అలంకరించి రథాలుగాతీర్చిదిద్దారు. కొత్తకొండ వరకు సాగిన ఎడ్ల బండి రథాలను తిలకించేందుకు ప్రజలు దారి వెంట బారులు తీరారు. హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా ఎడ్ల బండ్లతో వచ్చి ఆలయ ప్రదక్షిణలు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.
స్వామివారిని దర్శించుకున్న మంత్రులు
మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మకర సంక్రాంతి పర్వదినాన దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ, ఈవో కిషన్ రావు వారికి శేష వస్త్రాలు సమర్పించి స్వామి వారి మెమొంటోను ప్రధానం చేశారు. అంతకుముందు త్రిశూల చౌరస్తాను ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తకొండ ఆలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధులు, ఇతరత్ర అభివృద్ధి పనులకోసం రూ. 70 కోట్లు నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు.
జాతరలో వైద్య సేవలు..
బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భక్తులకు అందుబాటులో వైద్య సిబ్బంది ఉండి మందులు పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితి దృష్ట్యా అంబులెన్స్ ను అందుబాటులో ఉంచారు. దీంతోపాటు జాతరలో అగ్నిమాపక సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారు.
భారీ పోలీసు బందోబస్తు
జాతర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జూదం, మట్కా, గుట్కా, నాటుసారా లేకుండా పూర్తిస్థాయిలో పోలీసులు నియంత్రించారు. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు ఏసీపీలు పదిమంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 350 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొని సేవలందించారు.