హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రైతులు తిరుగుబాటు చేస్తారనే బీఆర్ఎస్ రైతు ధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఒక ప్రకటనలో విమర్శించారు. అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన ధర్నాకు అడ్డుచెప్పడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.
ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో క్లాక్‌టవర్ వద్ద అన్నివర్గాలు నిరసనలు తెలిపిన విషయం కాంగ్రెస్ మంత్రులు మరిచారా? అని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అకడే దీక్ష చేసిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి మద్దతుగా తెలుపుతున్న పౌరహకుల సంఘం నేతలు లక్ష్మణ్, హరగోపాల్ తదితర నేతలను అరెస్ట్ చేసి నిర్బంధించడం అక్రమమని విమర్శించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ధర్నా లు చేస్తే లేని ఇబ్బందులు, బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తే కలుగుతాయా? అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేయొచ్చు కానీ, రైతుల కోసం కేటీఆర్ ధర్నా చేస్తే అనుమతి ఎందుకివ్వరని ప్రశ్నించారు.