హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు అరకొరగా బిల్లులు చెల్లిస్తుండడంతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో రోడ్ల పనులు నిలిచిపోయాయి. ఇప్పటివరకు రూ.43,364 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం.. చిన్న కాంట్రాక్టర్లు (రూ.10 లక్షలలోపు విలువైన పనులు నిర్వహించినవారు) ఆందోళనకు దిగడంతో గత నెలలో రూ.1,032 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం మరో రూ.18 వేలకోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవికూడా పూర్తయితే మొత్తం బకాయిలు రూ.60వేల కోట్లకు చేరుకుంటాయి. ఈ బిల్లులన్నీ చెల్లించేవరకు పనులు నిర్వహించేదిలేదని కాంట్రాక్టర్లు భీష్మించారు. ఇప్పటికే కొత్త పనులను పూర్తిగా నిలిపివేసిన కాంట్రాక్టర్లు.. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను ఏదోవిధంగా పూర్తిచేయాలని భావిస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త పనులు చేపట్టడంతోపాటు బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించేవారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంట్రాక్టర్ల బకాయిలు కొండలా పెరిగిపోయాయి. వాటి కోసం ఇటీవల పలుమార్లు సచివాలయం, ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.200 కోట్ల బకాయిల్లో ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. రహదారుల అభివృద్ధి, వంతెనలు, భవనాల నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు గత రెండేండ్లుగా ఒక్కపైసా చెల్లించలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని అత్యవసర ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ ఆ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదు. వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను బాగుచేయించేందుకు సైతం నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్లకు దాదాపు రూ.5 వేలకోట్ల మేరకు నష్టం జరినట్టు అధికారులు గుర్తించారు. కానీ, రేవంత్రెడ్డి సర్కారు మాత్రం అత్యవసర మరమ్మతులతో సరిపెట్టింది.
కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ కాలయాపన చేయడమే తప్ప శాశ్వత మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు కేంద్రం నయాపైసా సాయం చేయకపోవడంతో రాష్ట్రంలో రోడ్లు బాగుపడక వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. హైబ్రిడ్ యాన్యు టీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్టు పేరిట గత రెండేండ్లుగా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఉన్న రోడ్లను మెరుగు పర్చేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టడంలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్అండ్బీ కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారిందని బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గత రెండేండ్లుగా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించలేదని, దీంతో కొత్త పనులు ఎలా చేపడుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చాలామంది కాంట్రాక్టర్లు ఆర్అండ్బీ టెండర్లలో పాల్గొనడంలేదని, రానున్న రోజుల్లో మూకుమ్మడిగా పనులకు విరామం ప్రకటించడం తప్ప మరో మార్గం లేదని చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే అనేకమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, పరిస్థితి ఇలాగే ఉంటే తామంతా కాంట్రాక్టు పనులు వదులుకొని వేరే పనులు వెతుక్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న రూ.18 వేలకోట్ల విలువైన పనులన్నీ మంత్రుల ఇలాకాలోనే జరుగుతున్నాయి. వాటిలో అత్యధికంగా రూ.5 వేల కోట్ల విలువైన రోడ్ల పనులు నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోనే కొనసాగుతున్నాయి. వాటికి కూడా ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వడంలేదు. వాస్తవానికి రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు ఏడాది క్రితమే నియోజకవర్గాలవారీగా ఆర్అండ్బీ శాఖకు లేఖలు సమర్పించారు. వాటి ఆధారంగా అధికారులు నివేదికలు రూపొందించారు. ప్రభుత్వం మాత్రం మంత్రుల నియోజకవర్గాల్లోని పనులకే నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు.
గత రెండేండ్లుగా పేరుకుపోయిన బిల్లులు రూ. 43,364 కోట్లు
గత నెలలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.1,032 కోట్లు
మిగిలిన బకాయిలు రూ.42,332 కోట్లు
ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పనుల విలువ రూ.18,000 కోట్లు